Serial Killer Arrest: ఢిల్లీలో సీరియల్ కిల్లర్ అరెస్టు.. 24 ఏళ్ల తరువాత పట్టుకున్న పోలీసులు
ABN, Publish Date - Jul 06 , 2025 | 04:36 PM
క్యాబ్ డ్రైవర్లను అంతమొందించి వారి కార్లను విక్రయించి సొమ్ము చేసుకునే ఓ సీరియల్ కిల్లర్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 24 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ డ్రైవర్లను హత్య చేసి వారి కార్లను అమ్మి సొమ్ము చేసుకునే ఓ సీరియల్ కిల్లర్‌ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దాదాపు 24 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అజయ్ లాంబాను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నాలుగు హత్య-దోపిడీ కేసుల్లో అజయ్ నిందితుడిగా ఉన్నాడని తెలిపారు (Delhi Serial Killer Arrested).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అజయ్, అతడి అనుచరులు అద్దె ట్యాక్సీల్లో ఉత్తరాఖండ్‌కు వెళ్లేవారు. అక్కడ డ్రైవర్‌లకు మాయమాటలు చెప్పి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసేవారు. ఆ తరువాత డ్రైవర్‌లకు ఊపిరాడకుండా చేసి అంతమొందించి మృతదేహాలను కొండల్లో ఎవరికంటా పడకుండా పారేసేవారు. ఆ తరువాత కార్లను సరిహద్దు దాటించి నేపాల్‌లో అక్రమంగా విక్రయించేవారు.
‘నిందితుడు ఓ కరుడుగట్టిన నేరగాడు. అతడు నాలుగు హత్య-దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2001లో అతడు ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేశాడు. వారిని అంతమొందించి మృతదేహాలను కొండల్లో పారేసేవాడు’ అని డీసీపీ ఓ ప్రకటనలో తెలిపారు.
అజయ్ లాంబా, అతడి అనుచరులు నాలుగు కంటే ఎక్కువ హత్యలే చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుల్లో కేవలం ఒక్కరి మృతదేహం మాత్రమే లభించిందని అన్నారు. లాంబా గ్యాంగ్‌లోని ఇద్దరిని ఇప్పటికే పోలీసుల అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను రాబట్టేందుకు వారిని విచారిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన లాంబా (48) 6వ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ తరువాత యూపీలోని బరేలీకి వెళ్లాడు. అక్కడ ధీరేంద్ర, దిలీప్ నేగీలతో చేతులు కలిపి క్యాబ్ డ్రైవర్‌ల హత్యలకు దిగాడు. దొంగతనం, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి ఇతర కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
గత కొంత కాలంగా లాంబాపై క్రైమ్ బ్రాంచ్ నిఘా పెట్టిందని పోలీసులు తెలిపారు. సాంకేతికత సాయంతో అతడి జాడ కోసం ప్రయత్నించినట్టు వివరించారు. 2008 నుంచి 2018 వరకూ నేపాల్‌లో తలదాచుకున్న అతడు ఆ తరువాత కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌కు వచ్చాడని తెలిపారు. 2020లో అతడు ఒడిశా, ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గంజాయి సప్లై చేశాడని కూడా తెలిపారు.
2021లో ఢిల్లీలోని సాగర్‌పూర్ పీఎస్‌లో లాంబాపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. గతేడాది ఒడిశాలోని ఓ నగల షాపులో దోపిడీకి సంబంధించి అతడిపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. అయితే, 2001 నాటి క్యాబ్ డ్రైవర్ల హత్య కేసుల్లో తన పాత్ర విషయంలో నిందితుడు అత్యంత గోప్యత పాటించాడని, ఎవరికీ ఎలాంటి వివరాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
శోభనం కోసం ఒత్తిడి చేసిన భర్తను అంతమొందించిన భార్య
నేనే ఆమెను చంపేశా.. నేరాన్ని అంగీకరించిన హర్యానా మోడల్ బాయ్‌ఫ్రెండ్
Updated Date - Jul 06 , 2025 | 04:49 PM