Instagram Video Goes Viral: పార్క్‌లో యువతితో యువకుడు.. ఆ వీడియో వైరల్ కావటంతో..
ABN, Publish Date - Sep 20 , 2025 | 06:53 AM
ఈ వీడియో గురించి పవన్‌కు తెలిసింది. వీడియోను డిలీట్ చేయించడానికి చాలా ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వీడియో కారణంగా కాలేజీతో పాటు ఊర్లోనూ తన పరువుపోయిందని పవన్ భావించాడు.
వైరల్ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆ వీడియో కారణంగా తన పరువు పోయిందని భావించిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. హాసన్ తాలూకాలోని కళ్లహళ్లి గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడు మోసలెహోలసళ్లి డిగ్రీ కాలేజీలో బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సెప్టెంబర్ 17వ తేదీన పవన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్క్‌కు వెళ్లాడు. ఆ ఫ్రెండ్స్‌లో యువతులు కూడా ఉన్నారు.
పార్క్‌లో ఉన్న సమయంలో పవన్ ఓ స్నేహితురాలి చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ ఎంతో చనువుగా మాట్లాడుకున్నారు. వీరితో ఎలాంటి సంబంధం లేని ఓ యువతి దీన్నంతా వీడియో తీసింది. ఆ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చి తన ఇన్‌గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘వీళ్లు పిల్లలు ఆడుకునే పార్క్‌లో ఎలాంటి పాడు పనులు చేస్తున్నారో చూడండి. పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి పనులు చేసే వారిని ఏం చేయాలో మీరే చెప్పండి? వారి తల్లిదండ్రులు ఇందుకే వాళ్లను కాలేజీకి పంపిస్తున్నారా?’ అంటూ ప్రశ్నించింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియో గురించి పవన్‌కు తెలిసింది. వీడియోను డిలీట్ చేయించడానికి చాలా ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వీడియో కారణంగా కాలేజీతో పాటు ఊర్లోనూ తన పరువుపోయిందని పవన్ భావించాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాలేజీ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి విగతజీవిగాపడున్న కుమారుడ్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Updated Date - Sep 20 , 2025 | 07:07 AM