CM Chandrababu Promises: ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:58 AM
రాష్ట్రంలో ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదులన్నింటినీ అనుసంధానించి.. ‘ఒకే రాష్ట్రం..
ఒకే రాష్ట్రం.. ఒకే జల విధానం
రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానిస్తాం
వంశధారకు వరదలు వస్తే.. ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా చేస్తాం
హంద్రీ-నీవా, గాలేరు-నగరితో సీమకు తాగు, సాగునీరిస్తాం
ఉత్తరాంధ్ర, గాలేరు-నగరి పథకాలు ఏడాదిలో పూర్తిచేస్తాం
పోలవరాన్ని 2027కల్లా పూర్తిచేస్తాం
ఈ ఏడాది 5,400 టీఎంసీలు కడలిపాలు
200 టీఎంసీల గోదావరి వరద నీరు
బనకచర్లకు వాడుకుంటామంటున్నాం
దీనిపై తెలంగాణ పునరాలోచించాలి
జగన్ విధ్వంసకుడు, అసమర్థుడు
అసెంబ్లీలో లఘు చర్చలో సీఎం ధ్వజం
అమరావతి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నదులన్నింటినీ అనుసంధానించి.. ‘ఒకే రాష్ట్రం.. ఒకే నదీ జల విధానం’ అమలు చేస్తామన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే.. ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ చేపడతామని తెలిపారు. అసమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో జగన్ చేసిన విధ్వంసం ఏమిటో స్పష్టమైందన్నారు. ఆయన విధ్వంసకుడు, అసమర్థుడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం డిసెంబరుకల్లా పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబరునాటికి పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం అసెంబ్లీలో సమర్థ నీటి యాజమాన్య విధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య విఽధానం అమలుతో రాష్ట్రంలో కరువన్నదే ఉండదని చెప్పారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి చూపించిందన్నారు. గోదావరి-కృష్ణా నదులను అనుసంఽధానం చేశామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని.. వంశధారకు వరదలొస్తే.. ఆ నీటిని సోమశిల వరకు తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం నియోజవర్గానికి కృష్ణా జలాలిచ్చి జన్మ సార్థకం చేసుకున్నానని.. ప్రజల రుణం తీర్చుకున్నానని ఒకింత భావోద్వేగానికి గురవుతూ చెప్పారు. జగన్ విధ్వంసక పాలనతో ఎంతో నష్టపోయామన్నారు. ఈ సందర్భంగా ‘జగన్ విధ్వంసకుడు’ అనే శీర్షికతో సభలో ఓ వీడియో క్లిప్పింగ్‌ను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ శాసనసభలో చేసిన ప్రకటనలను తెలియజేశారు.
కేంద్రం వద్దన్నా..
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును 2020లోనే పూర్తిచేసి జాతికి అంకితం చేయాల్సి ఉండగా.. జగన్ తన అసమర్థ, విధ్వంసక విధానంతో కేంద్రం వద్దంటున్నా కాంట్రాక్టు సంస్థను మార్చేసి.. నిర్మాణాలను ఆపేశారని చంద్రబాబు విమర్శించారు. ప్రాజెక్టు పూర్తి గడువుపై ఎప్పటికప్పుడు మాటమారుస్తూ.. తేదీలను వాయిదా వేస్తూ వచ్చారని అన్నారు. ‘వాస్తవానికి 2019లో మేం దిగిపోయేనాటికి ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తయ్యాయి. మా తర్వాత వచ్చిన జగన్ వాటిని యథాతథంగా కొనసాగించి ఉంటే.. 2020 నాటికే పూర్తయ్యేది. 2020లో గోదావరి వరదల ఉధృతికి డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. కేంద్ర జలశక్తి శాఖ వేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ కొత్తది నిర్మించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనివల్ల రూ.1,000 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సి వచ్చింది. ప్రాజెక్టు కూడా ఆలస్యమవుతోంది’ అని తెలిపారు. ప్రాజెక్టును 2021 ఖరీ్‌ఫకల్లా పూర్తి చేస్తామని ఒకసారి.. 2022 ఖరీ్‌ఫకు అంటూ మరోసారి.. 2023 ఖరీఫ్ నాటికంటూ ఇంకోసారి.. 2025 జూన్‌నాటికి పూర్తిచేస్తామని చివరిగా జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలను చంద్రబాబు ప్రదర్శించారు. అలాగే 2021 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదంటూ అప్పటి జలవనరుల మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ .. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా చూపించినప్పుడు ఎమ్మెల్యేలంతా ఘొల్లున నవ్వారు. అదేవిధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం వృధా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా చంద్రబాబు ప్రదర్శించారు. ‘పట్టిసీమ పంపులను ఆన్ చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుందోనని జగన్ పూర్తిగా ప్రాజెక్టును పక్కన పడేశారు. 2022లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. పట్టిసీమ పంపులను వేయకుంటే జనం తంతారన్న భయంతో అప్పుడు ఆన్ చేశారు. ఆ ప్రాజెక్టుతో పదేళ్లుగా రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరుతోంది’ అని తెలిపారు.
ఏడాదిలో హంద్రీ-నీవా విస్తరణ..
హంద్రీ-నీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాల ద్వారా సీమకు సాగు, తాగునీటిని అందిస్తాం. గాలేరు-నగరి విస్తరణ పనులు ఏడాదిలో పూర్తి చేసి కడపకూ నీటిని అంది స్తాం. ఏడాదిలోగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తాం. గోదావరి, కృష్ణా జలాలు కలసి ఈ ఏడాది ఇప్పటివరకు 5,400 టీఎంసీలు సముద్రంపాలయ్యాయి. వాటిలో 200 టీఎంసీల వర ద జలాలను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు వాడుకుంటామంటే అడ్డుపడడంపై తెలంగాణ ఆలోచించాలి. సాగునీటి రంగంపై కూటమికి ఉన్న శ్రద్ధ ఏమిటో.. చేసిన ఖర్చులు చూస్తే స్పష్టమవుతుంది. 2024 నుంచి ప్రాజెక్టులపై రూ.12,000 కోట్లు వ్యయం చేశాం. ఐదేళ్లలో రూ.60 వేల కోట్లు వ్యయం చేస్తాం.