Uttarpradesh: తండ్రి, సోదరుడి చేతిలో యువతి సజీవదహనం.. సహజీవనం చేస్తోందని తెలిసి..
ABN, Publish Date - Jun 10 , 2025 | 10:16 PM
అడవిలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభించిన కేసును యూపీ పోలీసులు ఛేదించారు. యువతి తండ్రి, సోదరుడు ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పారేశారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అడవిలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభించిన కేసులో యూపీ పోలీసులు నిందితులను తాజాగా అరెస్టు చేశారు. మహిళ తండ్రి, సోదరుడే ఈ ఆమెను చంపి పెట్రోల్ పోసి నిప్పటించినట్టు గుర్తించారు. యువతి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో ఇష్టం లేని తండ్రీకొడుకులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు గుర్తించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సరస్వతి మలియాన్ అనే యువతి గురుగ్రామ్‌లోని ఓ ఈకామర్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు 2019లోనే వివాహం జరిగింది. అయితే, రెండేళ్లకే ఆమె భర్తను విడిచిపెట్టి పుట్టింటికి వచ్చేసింది. ఆ తరువాత తండ్రి ఆమెకు 2022లో మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ క్రమంలో ఆమెకు తన గ్రామానికి చెందిన అమిత్ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది. వారి బంధం ఆమె కుటుంబసభ్యులకు అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో కుటుంబానికి నచ్చచెప్పేందుకు యువతి అప్పటికే పలుమార్లు ప్రయత్నించి విఫలమైంది.
ఇక మే 26న సరస్వతి అమిత్‌కు ఫోన్ చేసి తన కుటుంబ సభ్యుల మనసు మార్చేందుకు చివరి ప్రయత్నం చేయనున్నట్టు చెప్పింది. ఆ తరువాత ఆమె జాడ కనిపించకుండా పోయింది. ఆ రాత్రే సరస్వతి తండ్రి రాజ్‌వీర్ సింగ్, సోదరుడు సుమిత్ సింగ్ ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. సుమిత్ స్నేహితుడు యువతి కాళ్లను కదలకుండా పట్టుకుని ఉండగా తండ్రీసోదరుడు ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపి ఉంటారని పోలీసులు తెలిపారు. అనంతరం, మృతదేహాన్ని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. ఆ తరువాత రెండు రోజులకు పోలీసులకు యువతి తప్పిపోయిందంటూ ఫిర్యాదు చేశారు.
మహిళ మృతదేహం కాలిపోయి ఉండటంతో ఆమె ఎవరనేది గుర్తించడం పోలీసులకు తొలుత సవాలుగా మారింది. అయితే, యువతి చేతికున్న గాజుల ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన పోలీసులు యువతిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. హత్యానేరం, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం తదితర నేరాల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
త్వరగా ఇంటికొచ్చిన భర్తకు షాక్.. భార్య మరొకరితో క్లోజ్‌గా ఉండటం చూసి..
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..
Updated Date - Jun 10 , 2025 | 10:16 PM