Live in Relationship: కూతుర్ని చంపి సూసైడ్ డ్రామా.. ఆమె ప్రియుడి ఎంట్రీతో..
ABN, Publish Date - Aug 14 , 2025 | 09:53 AM
Live in Relationship: జూన్ 4వ తేదీన హరేష్, చంద్రికను అహ్మదాబాద్ తీసుకెళ్లిపోయాడు. అక్కడినుంచి మధ్య ప్రదేశ్ వెళ్లారు. ఆ తర్వాత రాజస్తాన్‌కు వచ్చి సెటిల్ అయ్యారు.
కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, కూతురి ప్రియుడి ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. అసలు విషయం బయటపడింది. కూతుర్ని చంపిన కేసులో చిక్కుకుని ఆ క్రూరమైన తండ్రి అల్లాడిపోతున్నాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
బనస్కంత జిల్లా, తరద్ తెహ్సిల్‌కు చెందిన హరేష్‌కు పాలన్‌పూర్‌కు చెందిన చంద్రికతో గత ఫిబ్రవరి నెలలో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చంద్రిక ఇంటికి దూరంగా ఉండి చదువుకునేది. దీంతో వీలైనంత ఎక్కువ సమయం ప్రియుడితో కలిసి తిరుగుతూ ఉండేది. మే నెలలో ఓ పెళ్లి కోసం చంద్రిక ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమెకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తల్లిదండ్రులు ఆమెకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. సంబంధాలు చూస్తున్నామన్నారు.
ఈ విషయం తెలియగానే చంద్రిక భయపడిపోయింది. వెంటనే హరేష్‌కు మెసేజ్ చేసింది. తనను తీసుకెళ్లిపోమని అడిగింది. జూన్ 4వ తేదీన హరేష్, చంద్రికను అహ్మదాబాద్ తీసుకెళ్లిపోయాడు. అక్కడినుంచి మధ్య ప్రదేశ్ వెళ్లారు. ఆ తర్వాత రాజస్తాన్‌కు వచ్చి సెటిల్ అయ్యారు. కూతురు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూన్ 12వ తేదీన ఆ జంట రాజస్తాన్‌లో ఉన్నట్లు గుర్తించారు.
అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రికను కుటుంబసభ్యులకు అప్పగించారు. హరేష్ మీద పాత కేసులు ఉండటంతో అతడ్ని అరెస్ట్ చేశారు. జూన్ 21వ తేదీన అతడు జైలునుంచి విడుదలై బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చెక్ చేయగా.. ఫోన్ డేటా అంతా డిలీట్ అయి ఉంది. ఇన్‌స్టా ఓపెన్ చేశాడు. అందులో చంద్రిక మెసేజ్‌లు ఉన్నాయి. ‘పోలీసులు బలవంతంగా నన్ను మా ఇంట్లో వాళ్లకు అప్పగించారు. మా వాళ్లు నాకు పెళ్లి చేస్తామని బలవంతం చేస్తున్నారు.
లేకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు’ అని ఉంది. దీంతో హరేష్ కోర్టును ఆశ్రయించాడు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. జూన్ 24వ తేదీన చంద్రిక ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం అతడికి అందింది. అయితే, చంద్రికది ఆత్మహత్య కాదని, కుటుంబసభ్యులే హత్య చేసి ఉంటారని హరేష్ అనుమానం వ్యక్తం చేశాడు. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో చంద్రిక తండ్రే ఆమెను చంపినట్లు తేలింది. హత్యతో సంబంధం ఉన్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న చంద్రిక తండ్రి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మంచం పక్కన మృత్యువు.. నిద్రలేచి ఉంటే చచ్చే వాడు..
ఇరిగేషన్ అధికారుల జల్సాలు.. డ్యూటీ వదిలి మందు పార్టీ..
Updated Date - Aug 14 , 2025 | 10:03 AM