Starlink: భారత్‌లో త్వరలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం.. యూజర్ చార్జీలు ఇవేనా
ABN, Publish Date - May 25 , 2025 | 12:49 PM
భారత్‌లో స్టార్‌లింక్ సంస్థ ఆఫర్ చేసే ప్రారంభ ప్యాకేజీ ధర గరిష్ఠంగా రూ. 840 వరకూ ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో పాటు ఇతర గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత్‌లో తమ సర్వీసులు ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్ మార్కెట్‌కు అనుగూణంగా అత్యంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ప్యాకేజీలు అందించేందుకు శాట్‌కామ్ సంస్థలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రారంభ డాటా ప్లాన్ ధర రూ.840కు మించి ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో స్పెక్ట్రమ్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ అధిక కస్టమర్ బేస్ సాయంతో ఖర్చుల భారం తగ్గించుకోవాలని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ట్రాయ్ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం నెలవారీ అర్బన్ యూజర్ చార్జీ రూ.500. ఇది కాక శాట్‌కామ్ సంస్థలు ఏజీఆర్‌పై 4 శాతం లెవీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒక మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌కు 8 శాతం చొప్పున వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో, సంప్రదాయిక సర్వీసుల కంటే శాటిలైట్ సర్వీసులు ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఇలా రకరకాల ఖర్చుల భారం తమపై ఉన్నప్పటికీ అంతర్జాతీయ శాట్‌కామ్ సంస్థలు మాత్రం వెనక్కుతగ్గట్లేదు. నిధుల లభ్యత సమృద్ధిగా ఉన్న స్టార్ లింక్ లాంటి సంస్థలు ఈ ఖర్చుల భారం తగ్గించుకునేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి.
‘‘స్పెక్ట్రమ్ కర్చు ఇంత ఎక్కువగా ఉన్నా ప్రారంభ ధర మాత్రం 10 డాలర్ల లోపే ఉండే అవకాశం ఉంది. వీలైనంత మంది కస్టమర్లను చేర్చుకుని స్పెక్ట్రమ్ భారం తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని’’ ఓ కన్సల్టింగ్ సంస్థ అధికారి వ్యాఖ్యానించారు.
భారత్‌లో కార్యకలాపాలకు సంబంధించి స్టార్‌లింక్ కొన్ని సాంకేతికపరమై సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సంస్థకు భూసమీప కక్ష్యలో పరిభ్రమిస్తున్న 7 వేల శాటిలైట్లు ఉన్నాయి. వీటితో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ యూజర్లకు సేవలు అందించే అవకాశం ఉంది. ఇది భారత వినియోగదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. స్టార్‌లింక్ శాటిలైట్‌ల సంఖ్య 18 వేలకు చేరుకున్నా కూడా 1.5 మిలియన్‌ల మందికి మాత్రమే శాటిలైట్ సేవలు లభించే అవకాశం ఉంది. అదనపు శాటిలైట్లు ప్రయోగించేందుకు స్టార్‌లింక్‌కు ప్రభుత్వం సంస్థ ఇన్‌స్పేస్ అనుమతులు కూడా అవసరం. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. దేశంలోని ప్రైవేటు సంస్థలకు ఇన్ స్పేస్ అనుమతులు జారీ చేస్తుంటుంది.
అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషణ్ ధరలను ఎంతగా తగ్గించేందుకు ప్రయత్ని్స్తున్నా సంప్రదాయిక బ్రాడ్ బ్యాండ్ ధరలతో పోలిస్తే ఇవి 8 నుంచి 17 రెట్లు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో శాటిలైట్ సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఖర్చులు తగ్గించుకుంటూ లాభాల బాట పట్టాలని స్టార్‌లింక్ లాంటి సంస్థలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 25 , 2025 | 12:58 PM