Stock Market Rally India: ఆరో రోజూ మార్కెట్ ముందుకే..
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:40 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాలతో ముగిశాయి, సెన్సెక్స్ 79,595కు, నిఫ్టీ 24,167కి చేరాయి. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లను అధిగమించగా, ఏథర్ ఎనర్జీ ఐపీఓ ఈ నెల 28న ప్రారంభం కానుంది
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఆరో రోజూ లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 416 పాయింట్ల మేర ఎగబాకి 79,824 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 187.09 పాయింట్ల లాభంతో 79,595.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 41.70 పాయింట్ల వృద్ధితో 24,167.25 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) కొత్త పెట్టుబడులు ఇందుకు దోహదపడ్డాయి. గడిచిన ఆరు సెషన్లలో సెన్సెక్స్ 5,748.44 పాయింట్లు (7.78 శాతం), నిఫ్టీ 1,768.1 పాయింట్లు (7.89 శాతం) బలపడ్డాయి. ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33.55 లక్షల కోట్ల వృద్ధితో రూ.427.37 లక్షల కోట్లకు (5.02 లక్షల కోట్ల డాలర్లు) చేరింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ @రూ.15 లక్షల కోట్లు: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ మరో రికార్డును నమోదు చేసింది. బ్యాంక్ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) తొలిసారిగా రూ.15 లక్షల కోట్ల మైలురాయికి చేరింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో లిస్టెడ్ కంపెనీ ఇదే. బీఎస్ఈలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేరు ఒక దశలో 2.23 శాతం పెరిగి రూ.1,970.65 వద్ద సరికొత్త జీవితకాల రికార్డును నమోదు చేసింది. చివరికి షేరు ధర 1.78 శాతం లాభంతో రూ.1,961.90 వద్ద స్థిరపడింది. దాంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.15.01 లక్షల కోట్లుగా నమోదైంది.
ఈ నెల 28 నుంచి ఏథర్ ఎనర్జీ ఐపీఓ: విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీదారు ఏథర్ ఎనర్జీ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని మాత్రం బాగా తగ్గించుకుంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సేకరణను కంపెనీ గతంలో ప్రకటించిన రూ.3,100 కోట్ల నుంచి రూ.2,626 కోట్లకు తగ్గించుకుంది.
Updated Date - Apr 23 , 2025 | 12:40 AM