RBI Dividend: రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్
ABN, Publish Date - May 24 , 2025 | 06:11 AM
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ నజరానా ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.2,68,590.07 కోట్ల భారీ డివిడెండ్ ప్రకటించింది.
ప్రభుత్వానికి ఆర్‌బీఐ భారీ నజరానా
రికార్డు స్థాయిలో చెల్లింపులు
2024-25లో 27.4% పెరిగిన డివిడెండ్
కలిసొచ్చిన ఫారెక్స్ లావాదేవీలు
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కేంద్ర ప్రభుత్వానికి భారీ నజరానా ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.2,68,590.07 కోట్ల భారీ డివిడెండ్ ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (సీబీడీ) ఈ మేరకు సిఫారసు చేసింది. ఈ నెల 15న జరిగిన సీబీడీలో ఆమోదించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ఆధారంగా ఆర్‌బీఐ ఈ మొత్తాన్ని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) చెల్లించిన రూ.2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4 శాతం ఎక్కువ. అయితే మార్కెట్ వర్గాలు అంచనా వేసిన రూ.3 లక్షల కోట్ల కంటే ఇది తక్కువే. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డివిడెండ్ రూపంలో రూ.2.56 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే ఆర్‌బీఐ ఒక్కటే ఇందులో రూ.2,68,590 కోట్లు సమకూర్చడం విశేషం. దీంతో డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ఎదురవుతున్న ఆర్థిక అనిశ్చితిని, భారత-పాక్ ఘర్షణలతో పెరగనున్న రక్షణ బడ్జెట్ కేటాయింపుల భారాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని కంటిజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ) లెవల్‌గా పిలిచే ఈక్విటీ మూలధనాన్ని.. ఆర్‌బీఐ తన ఆస్తి-అప్పుల పట్టిక (బ్యాలెన్స్ షీట్)లో 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.
ఆదాయం ఇలా
దేశ, విదేశీ రుణ పత్రాల పెట్టుబడులపై లభించే వడ్డీ, తన సేవలపై వసూలు చేసే రుసుములు, కమీషన్లు, విదేశీ మారక ద్రవ్య లావాదేవీల (ఫారెక్స్)పై వచ్చే లాభం, అనుబంధ సంస్థల నుంచి లభించే ప్రతిఫలం రూపంలో ఆర్‌బీఐకి ఏటా ఆదాయం వస్తుంది. ఇందులోంచి కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీ చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, నిర్వహణ ఖర్చులు, తరుగుదల కేటాయింపులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కంటిజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ) లెవల్ రూపంలో కొంత మొత్తాన్ని ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఏటా డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌ను రూ.83-84 మధ్య కొని రూ.84-87 మధ్య విక్రయించడం లాభాలను బాగా పెంచింది.
జలాన్ ఫార్ములాలో సవరణ
ఖర్చులు పోను తన మిగులు ఆదాయంలో ఎంత మొత్తాన్ని ఆర్‌బీఐ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి బదిలీ చేయాలనే దానిపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ 2019లో చేసిన సిఫారసులను ఆర్‌బీఐ ఇప్పటికీ అనుసరిస్తోంది. ఈ సిఫారసులు ఇప్పటికీ వర్తిస్తాయని ఆర్‌బీఐ వర్గాలు చెప్పాయి. అయితే అవసరాన్ని బట్టి కంటిజెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ) శాతంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు తప్పవని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు 6.5 శాతంగా ఉన్న సీఆర్‌బీని 7.5 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకుంది.
పీఆర్‌బీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
దేశంలో చెల్లింపుల వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు (పీఆర్‌బీ) ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న బోర్డు ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్‌విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (బీపీఎ్‌సఎస్) స్థానంలో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. ఈ బోర్డుకు ఆర్‌బీఐ గవర్నర్ చైర్మన్‌గా వ్యవహ రిస్తారు. ఆర్‌బీఐ నుంచి గవర్నర్‌తో సహా ముగ్గురు, కేంద్ర ప్రభుత్వం నామినేషన్ చేసే ముగ్గురు సభ్యులు ఈ బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఈ బోర్డు ఏడాదికి కనీసం రెండు సార్లు భేటీ అవుతుందని ఆ నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశంలో చెల్లింపుల వ్యవస్థ పనితీరును పర్యవేక్షించడంతో పాటు ఈ బోర్డు అవసరమైతే నియంత్రిస్తుంది.
Updated Date - May 24 , 2025 | 06:11 AM