Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:37 PM
రాబడి ఎక్కువగా ఉంటుందన్న ఆశతో పీఎఫ్ నిధులను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సలహాలు ఇచ్చే వారిని దగ్గరకు రానీయొద్దని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అధిక రాబడుల కోసం ప్రస్తుతం అనేక మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. కొందరు ఏకంగా ప్రావిడెంట్ ఫండ్ నిధులను కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నారు. అయితే, ఇది చాలా ప్రమాదకరమని ఫైనాన్షియల్ అడ్వైజర్లు చెబుతున్నారు. జీవిత చరమాంకంలో అక్కరకు రావాల్సిన సొమ్ము విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడి 10 శాతం నుంచి 13 శాతం మధ్య ఉండొచ్చన్న నమ్మకం జనాల్లో ఉంది. అయితే, కచ్చితంగా రాబడులు ఈ స్థాయిలో ఉంటాయన్న గ్యారెంటీ ఏమీ లేదని అభిషేక్ కుమార్ అనే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ తాజాగా లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. మార్కెట్ ఆధారిత పెట్టుబడి సాధనాల పని తీరు ఇది కాదని స్పష్టం చేశారు. 15 ఏళ్ల పాటు ఫైనాన్షియల్ ప్లానింగ్ రంగంలో పని చేసిన అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు.
అధిక రాబడులపై విశ్వాసంతో అనేక మంది ఇలాంటి రిస్కీ చర్యలకు దిగుతున్నారని అన్నారు. కొందరు ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా పెట్టుబడిదారులకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారని వాపోయారు. పీఎఫ్ నిధులను మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించడం చాలా ప్రమాదకరమైన చర్య అని హెచ్చరించారు. ‘మీ రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత కోసమే పీఎఫ్. ఇందులో పెట్టుబడి నెమ్మదిగానే వృద్ధి చెందాలి. భద్రత, పన్ను రాయితీ ఉండాలి. అధిక రాబడుల కోసం ఈ డబ్బును రిస్కీ పెట్టుబడుల్లోకి మళ్లిస్తే మీ భవిష్యత్తే ప్రమాదంలో పడొచ్చు’ అని హెచ్చరించారు.
సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్ అద్భుత సాధనాలే అయినప్పటికీ రాబడిపై ఎలాంటి గ్యారెంటీలు ఉండవని అన్నారు. ఒక ఏడాది 15 శాతంగా ఉన్న రాబడి, మరుసటి ఏడాది మైనస్ రెండు శాతానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వని వారే ఇతరులకు మ్యూచువల్ ఫండ్స్ రాబడి కచ్చితంగా ఉంటుందన్న హామీ ఇస్తారని అన్నారు. మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టపోయేది కస్టమర్లే అన్న విషయాన్ని ఫైనాన్షియర్ అడ్వైజర్లు మర్చిపోకూడదని హితవు పలికారు.
ఇవీ చదవండి:
ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 28 , 2025 | 03:57 PM