RBI Guidelines: మైనర్లూ మీ బ్యాంక్ అకౌంట్ మీరే ఆపరేట్ చేసుకోండి
ABN, Publish Date - Apr 22 , 2025 | 02:16 AM
ఇకపై 10 ఏళ్లు పైబడిన మైనర్లు బ్యాంక్ ఖాతాలు స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. బ్యాంకులు తగిన నిబంధనలతో ఖాతా నిర్వహణకు మార్గదర్శకాలు ఇచ్చే హక్కు కలిగి ఉంటాయని స్పష్టం చేసింది
అనుమతించిన ఆర్‌బీఐ
ముంబై: ఇక నుంచి మైనర్లు బ్యాంక్ అకౌంట్ స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతించింది. 10 సంవత్సరాల వయసు పైబడిన మైనర్లంద రూ తమ సహజసిద్ధమైన లేదా చట్టబద్ధమైన సంరక్షకుని ద్వారా పొదుపు/టర్మ్ డిపాజిట్ ఖాతాలు తెరుచుకునేందుకు, స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు అనుమతించాలని సూచిస్తూ బ్యాంకులకు ఆర్‌బీఐ సవరించిన ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు...వారు తల్లిని సంరక్షకురాలుగా పెట్టుకుని ఖాతాలు తెరిచేందుకు కూడా అనుమతించింది. అయితే తమ రిస్క్ నిర్వహణ విధానానికి అనుగుణంగా నిబంధనలు, ఖాతాలో నిల్వ మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయించవచ్చని పేర్కొంది. ఆ నియమనిబంధనలన్నింటికీ ఖాతాదారుకి తెలియచేయాలని కూడా సూచించింది. మైనారిటీ తీరిన అనంతరం ఖాతాదారు వద్ద తాజాగా నమూనా సంతకాలు తీసుకుని రికార్డుల్లో భద్రపరచాలని తెలిపింది.
మైనర్ల ఖాతాలపై ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డు, చెక్ బుక్ వంటి అదనపు సదుపాయాలు కల్పించే విషయంలో నిర్ణయాధికారం బ్యాంకులదేనని పేర్కొంది. మైనర్ల ఖాతాల్లో కనీస నిల్వ తగినంతగా ఉండేలా చూడాలని, ఎలాంటి పరిస్థితిలోనూ ఓవర్‌డ్రాకు అనుమతించవద్దని సూచించింది. బ్యాంకులన్నీ ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ దాటకుండా ప్రస్తుత విధానాల్లో సవరణలు లేదా కొత్త నిబంధనల జోడింపు చేయాలని ఆదేశించింది.
Updated Date - Apr 22 , 2025 | 02:19 AM