మహీంద్రా లాభంలో 13 5 percent వృద్ధి
ABN, Publish Date - May 06 , 2025 | 04:55 AM
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.3,541,85 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన...
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.3,541,85 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,124.94 కోట్లతో పోల్చితే లాభం 13.34 శాతం పెరిగింది. ఆటో, వ్యవసాయ పరికరాల రంగాలు ప్రదర్శించిన అద్భుత పురోగతి ఇందుకు కారణం. కాగా ఇదే కాలంలో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.35,373.34 కోట్ల నుంచి రూ.42,585.67 కోట్లకు చేరింది. ఆటో విభాగంలో అమ్మకాలు 18 శాతం పెరిగి 2.53 లక్షల యూనిట్లకు చేరాయని ఆటోమోటివ్, వ్యవసాయ పరికరాల విభాగం సీఈఓ రాజేష్ జెజూరికర్ తెలిపారు. ఆదాయంలో ఎస్‌యూవీ అమ్మకాల వాటా 3.10 శాతం, ఎల్‌సీవీల వాటా 4.80 శాతం పెరిగినట్టు చెప్పారు. ట్రాక్టర్ల విభాగంలో జీవితకాల గరిష్ఠ స్థాయిలో 41.2 శాతంమార్కెట్ వాటా సాధించామన్నారు. మొత్తం త్రైమాసిక వ్యయాలు రూ.39,113.61 కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు. త్రైమాసికంలో మొత్తం 2,53,028 వాహనాలు విక్రయించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా మార్చి 31వ తేదీతో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,58,749.75 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.14,073.17 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించినట్టు గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమర్‌జ్యోతి బారువా చెప్పారు. కాగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఒక్కో షేరుపై రూ.25.30 తుది డివిడెండును ప్రకటించింది.
కార్ల తయారీకి కొత్త ప్లాంట్: ప్రయాణికుల వాహనాల తయారీ కోసం కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2028 మార్చి నాటికి ఈ ప్లాంట్ పని ప్రారంభిస్తుందని జెజూరికర్ తెలిపారు. అది పూర్తిగా భవిష్యత్ దృక్పథంతో, అధునాతన టెక్నాలజీలతో నిర్మించే అతి పెద్ద ప్లాంట్ అని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆ ప్లాంట్‌ను ప్రయాణికుల వాహనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని వాహనాల తయారీకి కూడా అవకాశాలు కల్పించే అంశం పరిశీలించవచ్చునని ఆయన తెలిపారు. ఏ ప్రాంతంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదని, ఇందు కోసం వివిధ రాష్ర్టాల్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి సబ్సిడీలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఇందుకు అవసరం అయిన నిధులను మాత్రం పెట్టుబడి వ్యయాల్లో కేటాయించామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News
Updated Date - May 06 , 2025 | 04:55 AM