Rs 2000 Notes in Circulation: ఇప్పటికీ జనాల వద్ద రూ.2 వేల నోట్లు.. ఆర్బీఐ తాజా అప్‌డేట్ ఏంటంటే..
ABN , Publish Date - May 04 , 2025 | 12:33 PM
రూ.6266 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇప్పటికీ సర్క్యూలేషన్‌లో ఉన్నట్టు ఆర్బీఐ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. మొత్తం నోట్లలో దాదాపు 98 శాతం వెనక్కు వచ్చేశాయని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: సుమారు రెండేళ్ల క్రితం భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ.2 వేల నోటును ఉపసంహరించింది. అయితే, ఇప్పటికీ జనాల వద్ద రూ.6,266 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. 2023 మే 19న ఆర్బీఐ ఈ నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.
ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం, నోటు ఉపసంహరణ ప్రకటన సమయంలో ప్రజల వద్ద రూ.3.56 లక్షల విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నాయి. ఏప్రిల్ 30 నాటికి అవి రూ.6,266 కోట్లకు పడిపోయాయి. చెలామణిలో ఉన్న మొత్తం రూ.2 వేల నోట్లలో రూ.98.24 శాతం ప్రజలు తిరిగిచ్చేశారని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం 2023 అక్టోబర్ 7తోనే ముగిసింది. అయితే, ఆర్బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను మార్చుకుని తమ అకౌంట్లల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. మొత్తం 19 ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయాల్లో ఈ సదుపాయం ఉంది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను రూ.2 వేల నోట్లను ఇండియన్ పోస్టు ద్వారా ఆర్బీఐకి పంపించే అవకాశం కూడా ఉంది.
నోట్ల డీమోనెటైజేషన్‌లో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు 2016 నవంబర్ 8న రూ. వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీలకు బ్రేకులు వేసేందుకు ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించింది. అయితే, నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పెద్ద నోట్లను ప్రవేశపెట్టింది. కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఈ నోటును ప్రభుత్వం విడుదల చేసింది.
దేశ అవసరాలకు సరిపడా ఇతర డినామినేషన్‌ల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం రూ.2 వేల నోటును సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకుంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కూడా అనేక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం యూపీఐ ఆధారిత చెల్లింపులు వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి:
పెరిగిన ఏటీఎమ్ విత్‌డ్రా చార్జీలు.. నేటి నుంచి కొత్త రూల్స్
వాణిజ్యాన్ని ఆయుధంగా వాడొద్దన్న వారెన్ బఫెట్
Read More Business News and Latest Telugu News