India UK Free Trade Agreement: భారత్ యూకే వాణిజ్య ఒప్పందం ఉభయ తారకం
ABN, Publish Date - Jul 25 , 2025 | 02:51 AM
భారత-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై పారిశామ్రిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం భారత ఐటీ, ఫార్మా కంపెనీలకూ మేలు చేయనుంది...
ఫార్మా, ఐటీ రంగాలకు మరింత మేలు.. జీరో డ్యూటీతో ఫార్మా ఎగుమతులు
75,000 మంది ఐటీ ఉద్యోగులకు లబ్ధి
షరతులకు లోబడే ఆటో దిగుమతులు
రొయ్యలు, మామిడి గుజ్జు ఎగుమతులకూ ఊతం
న్యూఢిల్లీ: భారత-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై పారిశామ్రిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం భారత ఐటీ, ఫార్మా కంపెనీలకూ మేలు చేయనుంది. ప్రస్తుతం బ్రిటన్ వివిధ దేశాల నుంచి ఏటా 3,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.59 లక్షల కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. అందులో మన వాటా 100 కోట్ల డాలర్ల లోపే. తాజా ఒప్పందం ద్వారా బ్రిటన్ మన ఫార్మా ఎగుమతులను ఇక జీరో డ్యూటీతో అనుమతించనుంది. దీంతో ఆ దేశానికి మన ఫార్మా ఎగుమతులు భారీగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. జెనరిక్ ఔషధాలు, ఎక్స్-రే సిస్టమ్స్, ఈసీజీ మెషిన్స్, డయాగ్నోస్టిక్ పరికరాలు, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి మెడికల్ డివైసెస్ ఉత్పత్తులను భారత్ పెద్దఎత్తున బ్రిటన్‌కు ఎగుమతి చేస్తోంది. ‘బ్రిటన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ రెండు దేశాల ఆర్థిక సహకారంలో.. ముఖ్యంగా ఫార్మా రంగంలో ఒక ప్రధాన మైలురాయి. గత ఏడాది మనం ఆ దేశానికి 91.4 కోట్ల డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేశాం. ఈ ఒప్పందంతో మన ఎగుమతులు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల అక్కడి ప్రజలకీ మన ఔషధాలు చౌకగా లభిస్తాయి. అక్కడి నుంచి మన ఫార్మా రంగంలోకి మరింత ఎఫ్‌డీఐ వచ్చే అవకాశం ఉంది’ అని ఫార్మాగ్జిల్ చైర్మన్ నమిత్ జోషి చెప్పారు.
ఐటీ కంపెనీలకు ఊరట
బ్రిటన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏ ఐటీ రంగానికీ పెద్ద ఊరట కల్పించింది. దీంతో భారత కంపెనీల తరఫున బ్రిటన్ వెళ్లి, అక్కడి ప్రాజెక్టులు పూర్తి చేసే ఉద్యోగులకు మూడేళ్ల పాటు అక్కడి సామాజిక భద్రతా పథకాల కోసం చేసే చెల్లింపుల నుంచి మినహాయింపు లభించింది. దీనివల్ల బ్రిటన్‌లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న దాదాపు 75,000 మంది భారతీయులకు మేలు జరగనుంది. ‘భారత ఐటీ కంపెనీలు, ఉద్యోగులకు ఇది పెద్ద ఊరట’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్‌లోని బ్రిటిష్ కంపెనీల్లో పని చేసే బ్రిటిష్ పౌరులకు ఇది వర్తిస్తుంది. దీంతో కంపెనీలకు రెండు దేశాల్లో ఈ పథకాల కోసం పెద్ద మొత్తంలో చెల్లింపుల భారం తగ్గనుంది. ఈ మినహాయింపు సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీలకు బాగా మేలు చేయనుంది. దీంతో భారత ఐటీ కంపెనీలు బ్రిటన్‌పై మరింత శ్రద్ద పెడతాయని భావిస్తున్నారు.
ఆటోమొబైల్స్
బ్రిటన్‌తో కుదిరిన ఎఫ్‌టీఏలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంది. బ్రిటిష్ కార్ల దిగుమతులపై సుంకాన్ని ప్రస్తుత 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అయితే ఈ సౌలభ్యం కోటాలు, దిగుమతి చేసుకునే వాహనాల ఇంజన్ సామర్ధ్యం, ధరలకు లోబడి మాత్రమే ఉంటుంది. కోటాకు లోబడి పెట్రోల్ వాహనాలైతే ఇంజన్ సామర్ధ్యం 3,000 సీసీపైన, డీజిల్ వాహనాలైతే ఇంజన్ సామర్ధ్యం 2,500 సీసీపైన ఉన్న వాహన దిగుమతులకు మాత్రమే 10 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది.
పెట్రోల్, డీజిల్ వాహనాలైతే కనీస ధర 40,000 పౌండ్ల (సుమారు రూ.46.80 లక్షలు) పైన, ఈవీలైతే 80,000 పౌండ్లపైన ఉండాలని ఆంక్షలు పెట్టింది. టాటా గ్రూప్‌నకు చెందిన జాగ్వార్ అండ్ లాండ్ రోవర్, మహీంద్రా ఎలక్ట్రిక్, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలకు ఈ వాణిజ్య ఒప్పందం ఎంతో మేలు చేకూర్చనుంది. అలాగే ఆటోమొబైల్ కాంపోనెంట్ కంపెనీలకు లబ్ధి చేకూరుస్తుందని భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ సమాఖ్య (ఏసీఎంఏ) తెలిపింది.
ఇతర ప్రధాన అంశాలు
ఎలాంటి సుంకాలు లేకుండా భారత్ నుంచి పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పసుపు, మిరియాలు, యాలకులు, పప్పులు, మామిడి గుజ్జు, పచ్చళ్ల, కాఫీ, టీ వంటి రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తుల దిగుమతికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్
బ్రిటన్ పాల ఉత్పత్తులు, యాపిల్స్, ఓట్స్, వంట నూనెలు మాత్రం ఎఫ్‌టీఏ పరిధిలోకి రావు
భారత్ నుంచి చేపలు, రొయ్యలు, టూనా చేపల దిగుమతులపై సుంకాలు పూర్తిగా ఎత్తివేత
భారత్ నుంచి దిగుమతయ్యే జౌళి, వస్త్రాలు, దుస్తులు, ఫుట్‌వేర్‌పై సుంకాలు పూర్తిగా ఎత్తివేత
సుంకాలు పూర్తిగా ఎత్తివేయడంతో వచ్చే ఐదేళ్లలో బ్రిటన్‌కు రెట్టింపు కానున్న భారత ఇంజనీరింగ్ ఎగుమతులు
భారత ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులపైనా జీరో సుంకాలు
భారత నగలు, రత్నాల ఎగుమతులపైనా తగ్గనున్న దిగుమతి సుంకాలు
భారత తోలు ఉత్పత్తుల ఎగుమతులపైనా జీరో డ్యూటీ
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
Updated Date - Jul 25 , 2025 | 02:51 AM