Debt Fueled Growth: సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 09:07 AM
ఓ లక్ష్యం కోసం వ్యూహాత్మకంగా రుణాలు తీసుకుని సంపన్నులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటారని చార్టెర్డ్ అకౌంట్ ఒకరు చెప్పారు. ఈ సూత్రం తెలియని వారు మాత్రం సంపద పెంచుకోలేక ఇక్కట్ల పాలవుతుంటారని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వ్యాపారస్థుల దృక్పథంలో మార్పు వస్తోందని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పుకొచ్చారు. సరైన సమయంలో రుణాలతో వ్యాపారాలను విస్తరించుకుని కోట్లకు పడగలెత్తుతున్నారని వివరించారు. క్రమ పద్ధతిలో రుణాల సేకరణ ద్వారా భారతీయ వ్యాపారులు కొత్త మార్కెట్‌లకు విస్తరిస్తున్నారని తెలిపారు. వ్యాపారంలో దూసుకుపోవడానికి, వెనకబడటానికి మధ్య ప్రధాన అంతరం ఇదేనని వివరించారు. రుణాల విషయంలో అవగాహన లేక అనేక మంది వ్యాపారులు వెనుకబడిపోతున్నారని అన్నారు (Debt fuels Growth).
‘అధికశాతం వ్యాపారస్థులు తమ బిజినెస్‌ను విస్తరించలేకపోవడానికి ప్రధాన కారణం సొంత నిధులపై ఎక్కువగా ఆధారపడటమే. కానీ సంపన్నులు ఇలా చేయరు. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు వారు రుణాలపై ఆధారపడతారు’ అని తెలిపారు. ఈ చిట్కాతో సంపన్నులు తమ యాజమాన్య హక్కులు కోల్పోకుండానే వ్యాపారాన్ని సులువుగా విస్తరిస్తున్నారని తెలిపారు.
చిన్న, మధ్య శ్రేణి సంస్థల యాజమాన్యం మాత్రం లోన్స్ విషయంలో అతి జాగ్రత్త పాటించి చివరకు వ్యాపార విస్తరణలో వెనకబడుతున్నారని అన్నారు. ఆదాయం, వ్యాపారాభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా రుణాలు తీసుకుని ముందడుగు వేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండానే వ్యాపారాన్ని సులువుగా విస్తరించుకోవచ్చని తెలిపారు.
‘అప్పు అంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎంచుకునే మార్గం కాదు. ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఒక లక్ష్యంతో తీసుకున్న రుణాలతో కొత్త ఆస్తులను సొంతం చేసుకోవచ్చు. ఆదాయం పెంచుకోవచ్చు. ఎంచుకున్న రంగాల్లో అగ్రగామిగా ఉండొచ్చు. నిధుల లేమి వ్యాపారాభివద్ధికి అడ్డంకి కాకూడదు’ అంటూ కీలక వ్యాపార సూత్రాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార వాణిజ్య సంస్థలకు అనేక మార్గాల్లో నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవగాహన లేమి, ఆలోచనల్లో మార్పు లేకపోవడమే వ్యాపారాభివృద్ధికి ప్రధాన అవరోధాలుగా మారాయని వివరించారు.
అయితే, యువ వ్యాపారవేత్తలు, వ్యాపార కుటుంబాల నుంచి వచ్చిన రెండో తరం వ్యక్తుల్లో మాత్రం ఈ దిశగా మార్పు కనిపిస్తోందని తెలిపారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు వారు వెనకాడట్లేదని అన్నారు. డబ్బున్న వారి ఆలోచన ధోరణిని కూడా వివరించారు. ‘ఒక్క రూపాయి అప్పుతో రాబడి ఎంత మేరకు పెరిగిందని వారు ఆలోచిస్తారు. కోటి రూపాయల అప్పుతో రెండేళ్ల తరువాత ఆదాయం రూ.5 కోట్లకు చేరిందంటే రుణాన్ని సద్వినియోగం చేసుకున్నట్టే’ అని చెప్పారు. బిజినెస్ లైఫ్ సైకిల్, రిస్క్‌ల ఆధారంగా సంపన్నులు రుణాలు తీసుకుంటారని తెలిపారు.
ఇవీ చదవండి:
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి