HCL RevenueGrowth: హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,307 కోట్లు
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:43 AM
హెచ్‌సీఎల్ టెక్ గత ఆర్థిక సంవత్సరం రూ.4,307 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కంపెనీ 2,665 కొత్త నియామకాలు చేసినా, 2025లో ప్రతీ త్రైమాసికానికి 2,000 మందిని ఫ్రెషర్స్‌గా నియమించేందుకు ప్లాన్ చేసింది
ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,307 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 8.1 శాతం వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో ఆదాయం 6.1 శాతం పెరిగి రూ.30,246 కోట్లకు చేరింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ ఆదాయం 6.5 శాతం వృద్ధితో రూ.1,17,055 కోట్లకు, నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.17,390 కోట్లకు చేరింది. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.18 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
కొత్తగా 2,665 నియామకాలు
పరిశ్రమ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా హెచ్‌సీఎల్ టెక్ గత ఆర్థిక సంవత్సరం 2,665 కొత్త నియామకాలు చేపట్టింది. దీంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 2,23,420కు చేరింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా ప్రతి మూడు నెలలకు 2,000 మంది చొప్పున ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది.
Updated Date - Apr 23 , 2025 | 12:44 AM