India Economy: ఎగుమతుల్లో గుజరాత్ టాప్
ABN, Publish Date - Aug 06 , 2025 | 01:23 AM
దేశ ఎగుమతుల్లో గుజరాత్ హవా కొనసాగుతోంది. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో
రూ.9.83 లక్షల కోట్లతో అగ్రస్థానం
6,7 స్థానాల్లో ఏపీ, తెలంగాణ
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో గుజరాత్ హవా కొనసాగుతోంది. మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.9.83 లక్షల కోట్ల ఎగుమతులతో గుజరాత్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం దేశం నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల్లో 26.6 శాతం ఒక్క గుజరాత్ నుంచే ఎగుమతయ్యాయి. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) మంగళవారం దీనికి సంబంధించిన వివరాలు విడుదల చేసింది. గుజరాత్ తర్వాత మహారాష్ట్ర రూ.5.57 లక్షల కోట్ల ఎగుమతులతో ద్వితీయ స్థానం సంపాదించింది. తమిళనాడు (రూ.4.53 లక్షల కోట్లు) కర్ణాటక (రూ.2.65 లక్షల కోట్లు), ఉత్తర ప్రదేశ్ (రూ.1.91 లక్షల కోట్లు) రాష్ట్రాలు మూడు, నాలుగు, ఐదో స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల హవా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గత ఆర్థిక సంవత్సరం దేశ ఎగుమతుల్లో ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఏపీ నుంచి 2,078 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 5.17 శాతం ఎక్కువ. ఇది గత ఆర్థిక సంవత్సరం దేశం నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల్లో 4.75 శాతానికి సమానం. తెలంగాణ నుంచి గత ఆర్థిక సంవత్సరం 1,912 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.66 లక్షల కోట్లు) విలువైన ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 36.33 శాతం ఎక్కువ. దేశ మొత్తం ఎగుమతుల్లో ఇది 4.37 శాతానికి సమానమని ఫియో తెలిపింది.
Updated Date - Aug 06 , 2025 | 01:23 AM