Gold in Locker: బ్యాంక్ లాకర్‌లో బంగారం దాస్తున్నారా.. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెబుతున్నారో తెలిస్తే..
ABN, Publish Date - Jul 07 , 2025 | 08:32 PM
బంగారాన్ని లాకర్లలో భద్ర పరిచే బదులు ఇతర పెట్టుబడి సాధనాల్లోకి మళ్లిస్తే కాలు కదపకుండా ఆదాయం పొందొచ్చని ఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పుకొచ్చారు. బ్యాంక్ లాకర్ల ఇన్సూరెన్స్ కూడా పరిమితంగా ఉండే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా నగలు, ఆస్తి దస్తావేజులను బ్యాంక్ లాకర్‌లో దాచి పెడతాం. ఇక అవి సేఫ్ అని అనుకుని నిశ్చింతగా ఉంటాం. అయితే, లాకర్‌లో బంగారు నగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోవిష్ ఆనంద్ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ లింక్డ్‌ఇన్‌లో ఇటీవల రాసుకొచ్చారు. లాకర్‌లో బంగారు నగలు దాచుకున్న తన క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి ఏమైందో చెప్పుకొచ్చారు (Gold Locker Risk).
ఓసారి తన ఫ్రెండ్ నగలున్న బ్యాంక్ లాకర్‌లోకి వరద పోటెత్తడంతో భారీ నష్టం వచ్చిందని లోవిష్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో లభించే ఇన్సూరెన్స్ పరిహారం గరిష్ఠంగా రూ.3 లక్షలే కావడంతో అతడికి చాలా నష్టం వచ్చిందని తెలిపారు. కాబట్టి, లాకర్‌లో నగలకు ప్రజలు ఊహించినంత భద్రత ఉండదని అన్నారు. చాలా మంది భారతీయుల దృష్టిలో బంగారం అంటే కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదని తెలిపారు.
లాకర్‌లల్లో బంగారాన్ని నిరుపయోగంగా వదిలేసే బదులు దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలని లోవిష్ అన్నారు. బంగారంతో వచ్చే ఆదాయాన్ని కోల్పోవద్దని తెలిపారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు తమ వద్ద నిరుపయోగంగా పడి ఉన్న బంగారు నగలను ఈ పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. ఆ తరువాత బంగారు నగల స్వచ్ఛత, బరువు వంటివి నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేస్తారు.
ఆపై బంగారం విలువలో 2.25 నుంచి 2.5 శాతం వరకూ వార్షిక వడ్డీని డిపాజిటర్లు పొందొచ్చు. ఇలా చేస్తే బంగారం చోరీ, లాకర్ ఇన్సూరెన్స్‌కు ఉన్న పరిమితులు, విలువ తరుగు వంటి భయాల నుంచి విముక్తి పొందొచ్చు. లాకర్లను వినియోగించే చాలా మంది వాటిని దశాబ్దాల పాటు అలాగే వదిలేస్తారని లోవిష్ తెలిపారు. దీనికి బదులు జీఎమ్ఎస్‌లోకి మళ్లిస్తే కాలు కదపకుండా మంచి ఆదాయం పొందొచ్చని అన్నారు. లాకర్లంటే ఆస్తులకు పరిరక్షణ కాదని, కేవలం వస్తువులను పెట్టుకునే బాక్సులు మాత్రమేనని తెలిపారు. మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, శ్రమలేని ఆదాయ మార్గాలను వృథా చేసుకోవద్దని సూచించారు.
ఇవీ చదవండి:
సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 07 , 2025 | 09:13 PM