Yes Bank Loan Fraud: యస్ బ్యాంక్ లోన్ మోసం కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
ABN, Publish Date - Aug 05 , 2025 | 12:16 PM
Yes Bank Loan Fraud: లోన్ మోసం కేసుకు సంబంధించి ఈడీ ఆగస్టు 1వ తేదీన అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ వెంటనే ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ: రూ.17వేల కోట్ల లోన్ మోసం కేసు విచారణ నిమిత్తం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఆయన చేరుకున్నారు. 11.30 గంటలకు విచారణ మొదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈడీ అధికారులు అనిల్ లాయర్లను లోపలికి అనుమతించలేదు. లాయర్లు లేకుండానే అనిల్‌ను విచారిస్తున్నారు. మొత్తం విచారణను కెమెరాలో రికార్డు చేస్తున్నారు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్ (PMLA) కింద అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. కాగా, లోన్ మోసం కేసుకు సంబంధించి ఈడీ ఆగస్టు 1వ తేదీన ఆయనకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ వెంటనే అంబానీకి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిశ్వాల్‌ను సైతం అరెస్ట్ చేసింది. రూ.68.2కోట్ల విలువైన ఫేక్ గ్యారెంటీలు ఇచ్చాడన్న ఆరోపణల నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద బిశ్వాల్ ను అదుపులోకి తీసుకుంది.
కేసు వివరాలు
2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోన్ ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లకు పెద్ద మొత్తం నిధులు అందినట్లు ఈడీ కనుగొంది. రూ.3వేల కోట్ల లోన్ నిధుల మళ్లింపును క్విడ్ ప్రోకోగా తేల్చింది. అంతేకాదు.. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మరో రూ.14వేల కోట్ల లోన్ మోసాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. మొత్తం రూ.17వేల కోట్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. వివిధ బ్యాంకుల నుంచి రిలయన్స్ కంపెనీ తీసుకున్న లోన్ల గురించీ ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే పలు బ్యాంకులకు లోన్ల వివరాలు చెప్పాలంటూ లేఖలు రాసింది.
ఇవి కూడా చదవండి
టమోటాకు టైమొచ్చింది.. కిలో ఎంతంటే..
వీధిలో నడుచుకుంటూ వెళుతున్న బామ్మ.. ఇంతలో ఊహించని సంఘటన
Updated Date - Aug 05 , 2025 | 01:18 PM