YSRCP: పేలవంగా వైసీపీ నిరసనలు
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:32 AM
ఈ నిరసన పేలవంగా సాగింది. పార్టీ అధిష్ఠానం పదే పదే చెప్పినా చాలా జిల్లాల్లో కీలక నాయకులు లైట్ తీసుకున్నారు. ఇక, సాధారణ ప్రజానీకం అసలు పట్టించుకోలేదు.
వెన్నుపోటు దినానికి ప్రజలు దూరం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీని ‘వెన్నుపోటు దినం’ పేరుతో బుధవారం వైసీపీ నిరసనకు పిలుపునిచ్చింది. అయితే.. ఈ నిరసన పేలవంగా సాగింది. పార్టీ అధిష్ఠానం పదే పదే చెప్పినా చాలా జిల్లాల్లో కీలక నాయకులు లైట్ తీసుకున్నారు. ఇక, సాధారణ ప్రజానీకం అసలు పట్టించుకోలేదు. మరోవైపు.. వైసీపీ నాయకులు కొందరు పోలీసులపైనా, ప్రజలపైనా తమ ప్రతాపం చూపించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు సాగాయి. అయితే ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దర్శిలో నిర్వహించిన కార్యక్రమానికి పట్టుబట్టి కార్యకర్తలను తరలించినా.. వారు ఎక్కువ సేపు ఉండలేదు. కనిగిరిలో సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు పెద్దగా కనిపించలేదు.
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమంలో కర్నూలు నుంచి కూలీలను తరలించారు. పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కర్నూలుకు చెందిన మహిళా కూలీలు కనిపించారు. ఎక్కడి నుంచి వచ్చారని మహిళల్ని ప్రశ్నిస్తే కర్నూలు చెన్నమ్మ సర్కిల్, సీక్యాంపు సెం టర్ల నుంచి తుఫాన్ వాహనాల్లో వచ్చామన్నారు. వైసీపీ నాయకుడు ఒకరు తమకు ఒక్కొక్కరికీ రూ.500 ఇచ్చారని మహిళలు పేర్కొన్నారు.
మైలవరంలో మాజీ మంత్రి జోగి రమేశ్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు బైఠాయించి నిరసన తె లిపారు. గన్నవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మా జీ మంత్రి పేర్ని నాని ఆఽధ్వర్యంలో నిరసన చేపట్టారు.
తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమానికి సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండిలో నామమాత్రంగానే పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. వైసీపీ వారే ఉన్నా ఈ కార్యక్రమానికి స్వల్పంగా హాజరయ్యారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు చాలా తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. కదిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి, నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్ అహమ్మద్ ముఖం చాటేశారు. హిందూపురం నియోజకవర్గంలో కీలక నేతలు కూడా డుమ్మా కొట్టారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి పదుల సంఖ్యలోనే కార్యకర్తలు హాజరయ్యారు. 7 నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో పాటు ఒకరిద్దరు ముఖ్యనేతలు మాత్రమే హాజరయ్యారు.
కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలపుడు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చంద్రబాబు అన్నారని బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనిపించుకున్నారని విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పు చేయగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తొలుత ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు.
గాలికి కొట్టుకుపోతారు!
వైసీపీని ఈసారి గెలిపించకపోతే ప్రజలందరూ గాలికి కొట్టుకుపోతారని గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ శాపనార్థాలు పెట్టారు. పొన్నూరులో నిర్వహించిన వెన్నుపోటు దినంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
‘వైఎస్సార్ డౌన్ డౌన్’
చిత్తూరు జిల్లాలోని జీడీ నెల్లూరులో నిర్వహించిన వెన్నుపోటు దినంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జి కృపాలక్ష్మి పాల్గొన్నారు. దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి వెనుతిరుగుతున్న సమయంలో అక్కడి కార్యకర్తలు ఒక్కసారిగా ‘వైఎస్సార్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.
సీఐపై రాంబాబు జులుం
గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబును స్థానిక పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అనుమతి లేదని పేర్కొన్నారు. దీంతో అంబటి సీఐపై నోరు పారేసుకున్నారు. ‘బొంగా నువ్వు చేసేది..’అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఏం చేస్తావ్?.’’అంటూ పళ్లుకొరుకుతూ సీఐ మీదికెళ్లే ప్రయత్నం చేశారు. మర్యాదగా మాట్లాడాలంటూ సీఐ హెచ్చరించగా ఏం చేస్తావంటూ అంబటి మరింత రెచ్చిపోయారు. దాంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరించడం, దూషించడం, చట్ట విరుద్థంగా గుమికూడటం తదితర కార్యకలాపాల నేపథ్యంలో ఆయా సెక్షన్‌ల కింద రాంబాబుపై కేసు నమోదు చేశారు. అంబటి అనుచరుడు వినోద్‌తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:32 AM