ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly Speaker: 60 డెస్.. టెన్షన్‌...!

ABN, Publish Date - Feb 25 , 2025 | 03:30 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరు కూడా అచ్చం ఇలాగే ఉంది. ‘60 రోజులు శాసన సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది’ అని స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ చెప్పగానే...

  • జగన్‌ను భయ పెట్టిన ‘అనర్హత వేటు’!

  • పరుగు పరుగున సభకు హాజరు

  • ఆర్టికల్‌ 109(4)లో 60 రోజుల గైర్హాజరు నిబంధన

  • ఆ లెక్కచూసుకున్నా ఇంకా చాలా గడువే ఉంది

  • ఈ సెషన్‌కు రాకున్నా 43 రోజులే గైర్హాజరైనట్లు

  • సోమవారం సభకు వచ్చినా.. రానట్లే!

  • గవర్నర్‌ ప్రసంగం లాంఛన ప్రాయం

  • అసెంబ్లీ పని దినం కిందకు రాదు!

  • జగన్‌పై అనర్హత వేటు కత్తి వేలాడుతున్నట్లే

  • ఒట్టు తీసి గట్టున పెట్టి మరోసారి రావాల్సిందే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘వరుసగా ఆబ్సెంట్‌ అవుతున్నావ్‌! రేపు బడికి రాకపోతే టీసీ ఇచ్చేస్తాం’ అని హెడ్మాస్టర్‌ హెచ్చరిస్తే ఏం జరుగుతుంది? పిల్లాడు పరిగెత్తుకుంటూ స్కూలుకు వెళతాడు! వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరు కూడా అచ్చం ఇలాగే ఉంది. ‘60 రోజులు శాసన సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది’ అని స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ చెప్పగానే... ఏ లెక్కలూ వేసుకోకుండా సోమవారం అసెంబ్లీకి వెళ్లి... వచ్చారు! అసలు విషయమేమిటంటే... గవర్నర్‌ ప్రసంగంచేసిన రోజును శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గుర్తించరు. అంటే, సోమవారం వైసీపీ సభ్యులు సభకు వచ్చినా, రానట్టే! మరో విషయం ఏమిటంటే... వైసీపీ ఎమ్మెల్యేలకు ‘60 రోజుల గండం’ ముంచుకొచ్చేందుకు ఇంకా చాలా సమయముంది. ప్రస్తుత శాసనసభ సమావేశాల పనిదినాలను కలిపినా... ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా 43 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగినట్లు! అంటే, జగన్‌కు ఇంకో 17 రోజుల గడువు ఉంది. కానీ... తెలిసో, తెలియకో సోమవారం వైసీపీ సభ్యులు ‘హాజరు’ కోసం సభకు వెళ్లొచ్చారు.


అరవై రోజుల లెక్కేమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 190(4) ప్రకారం.. ఒక ఎమ్మెల్యే 60 రోజులపాటు అసెంబ్లీకి గైర్హాజరైతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంది. అయితే... అసెంబ్లీ ప్రోరోగ్‌ అయినా, సమావేశాలు జరుగుతున్నప్పుడు 4 రోజులకన్నా ఎక్కువ సెలవులు వచ్చినా వాటిని ఈ 60 రోజుల్లో కలపరు. కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీ తొలి సెషన్‌ 2024 జూన్‌ 21, 22న జరిగింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే సరిపోయింది. తొలి సెషన్‌లో భాగంగానే 2024 జూలై 22నుంచి జూలై 26 వరకు ఐదు రోజులు సభ జరిగింది. రెండో సెషన్‌ 2024 నవంబరు 11 నుంచి 22 వరకు జరిగింది. తాజాగా మూడో సెషన్‌ సోమ వారం ప్రారంభమైంది. మార్చి 21 వరకు జరగనుంది. ప్రమాణ స్వీకార రోజులను మినహాయించి మూడు సెషన్ల సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే... అసెంబ్లీ సమావేశాలు 43 రోజులపాటు జరిగినట్లు! అంటే జగన్‌కు ఇంకా 17 రోజుల సమయం ఉంది. ‘60 రోజుల హాజరు’ అంశం పదేపదే తెరపైకి రావడంతో ఎక్కడ అనర్హత వేటు పడుతుందో అనే భయంతో జగన్‌ సోమవారం అసెంబ్లీకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టగానే వచ్చిన పని పూర్తయినట్లు భావించిన వైసీపీ సభ్యులు... పట్టుమని పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెనుదిరిగారు. ఇక్కడే ఓ తిరకాసు వచ్చింది. గవర్నర్‌ ప్రసంగం రోజును వర్కింగ్‌ డేగా పరిగణించరని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. స్పీకర్‌ అధ్యక్షతన జరిగితేనే వర్కింగ్‌ డే అవుతుందని.. గవర్నర్‌ ప్రసంగం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే లాంఛనంమేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన జగన్‌పై 60 రోజుల నిబంధన కత్తి వేలాడుతూనే ఉంది. అనర్హత వేటు తప్పించుకోవాలంటే ఈ సెషన్‌లో కానీ, వచ్చే శీతాకాల సమావేశాల్లో కానీ మరోసారి అసెంబ్లీ గడప తొక్కాల్సిందే!


సమస్యల ప్రస్తావనకు సంఖ్యతో పనేంటి?

సభలో ప్రజా సమస్యల ప్రస్తావనకు... పార్టీకి ఉన్న సభ్యులకూ సంబంధం లేదని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ఒకప్పుడు లోక్‌సభలో బీజేపీకి ఇద్దరంటే ఇద్దరే సభ్యులు ఉండేవారు. వారిద్దరూ లోక్‌సభకు క్రమం తప్పకుండా హాజరవుతూ... తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యలను ప్రస్తావించారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు తమ సంఖ్యతో సంబంధం లేకుండా అధికారపక్షాన్ని గట్టిగా నిలదీసేవారు. జగన్‌ మాత్రం తాను ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే.. ప్రతిపక్షనేత హోదా కావాల్పిందేనని పట్టుబడుతుండటం గమనార్హం!

ప్రజా సమస్యలు పట్టవా?

జగన్‌ కేవలం అనర్హత వేటు తప్పించుకునేందుకే అసెంబ్లీకి రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ప్రధాన ప్రతిపక్షనేత పదవీ.. దాని ద్వారా సంక్రమించే విశేష అధికారాలే జగన్‌కు ముఖ్యమా? ప్రజా సమస్యలు పట్టవా?’’ అని జనం మండిపడుతున్నారు. ‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తా! అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రితో సమానంగా శాసనసభలో మాట్లాడే అవకాశం దక్కుతుంది’ అని చెబుతూ వచ్చిన జగన్‌ సోమవారం బేషరతుగా అసెంబ్లీకి రావడం గమనార్హం. సభలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి జగన్‌ అసహనంగా కనిపించారు. పోడియం వద్దకు వెళ్లాలంటూ.. అసహనంతో చేతులు ఊపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎగదోశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కావడమే ఆలస్యమన్నట్లుగా... జగన్‌లేచి నిలబడి, సభలో ఆందోళనకు దిగాలంటూ తమ నేతలను ఆదేశించారు.

Updated Date - Feb 25 , 2025 | 03:30 AM