YS Sharmila: రప్పా రప్పా నరుకుతా’కు జగన్ వత్తాసా
ABN, Publish Date - Jun 21 , 2025 | 04:15 AM
రప్పా రప్పా నరుకుతామంటున్న వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ అధినేత జగన్ సమర్థించడం శోచనీయమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?
విభజన హామీల బాధ్యత మోదీదే: వైఎస్ షర్మిల
విశాఖపట్నం/అనకాపల్లి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రప్పా..రప్పా నరుకుతామంటున్న వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ అధినేత జగన్ సమర్థించడం శోచనీయమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఆమె నిర్వహించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్ ఆ తరహా వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.
హింసాత్మక వైఖరిని వ్యాప్తిచేసేలా జగన్ వ్యవహారశైలి ఉండడం దురదృష్టకరమన్నారు. నరికేస్తాం, చంపేస్తాం, బట్టలూడదీస్తామనే మాటలు ఒక నాయకుడు మాట్లాడాల్సినవి కావని, ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ అండను చూసుకునే జగన్ బహిరంగంగా అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. జగన్ ముమ్మాటికీ మోదీ దత్తపుత్రుడేనన్నారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో జగన్‌కు మోదీ మద్దతు ఉన్నదని షర్మిల ఆరోపించారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చి పోతున్నారేగానీ, ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్నారు. విభజన హామీలను అమలు చేయని మోదీ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి మోదీ వెన్నుపోటు పొడుస్తున్నా కేంద్రంలోని ప్రభుత్వానికి చంద్రబాబు సహకారాన్ని అందిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా యోగాంధ్ర నిర్వహించడం అవసరమా?...అని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ నేత కొప్పుల రాజు, విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ హాసినివర్మ పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 06:31 AM