AP Medical Colleges: కొత్త వైద్య కాలేజీలకు వైసీపీ శాపం
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:29 AM
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలు గత వైసీపీ సర్కారు నిర్వాకం కారణంగా కొరగాకుండా పోయాయి. ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి.
జగన్ ప్రభుత్వ మితిమీరిన నిర్లక్ష్యంతో
ఐదు వైద్య కళాశాలల్లో సౌకర్యాల లేమి
పూర్తిస్థాయిలో లేని బోధనా సిబ్బంది
అభ్యంతరం వ్యక్తంచేసిన మెడికల్ కౌన్సిల్
లోపాలు సరిదిద్దని అప్పటి జగన్ ప్రభుత్వం
అడ్మిషన్లకు ముందు సరిచేస్తామని హామీ
ఆ తర్వాత పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
ఎన్‌ఎంసీ నుంచి సర్కారుకు లేఖ
వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశం
ఢిల్లీ వెళ్లిన సెక్రటరీ, డీఎంఈ
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలు గత వైసీపీ సర్కారు నిర్వాకం కారణంగా కొరగాకుండా పోయాయి. ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి. వైసీపీ మరో ఏడాదిలో అధికారం కోల్పోతుందనగా హడావుడిగా 5 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు తీసుకువచ్చారు. అయితే.. ఈ అనుమతులు ఇచ్చేందుకు ఎన్‌ఎంసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీలకు అవసరమైన భవనాలు నిర్మించలేదని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ తొలుత ఆయా కాలేజీలకు అనుమతి ఇవ్వలేదు. అయితే, అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చింది. అలా అనుమతులు తెచ్చుకునే సమయంలో.. ఆయా కాలేజీలకు రెండేళ్లలో భవనాలు పూర్తి చేస్తామని, ఫ్యాకల్టీని నియమిస్తామని, క్లినికల్, నాన్ క్లినికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఆ ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు కండిషనల్‌గా అనుమతులిచ్చింది. కానీ, ఆ తర్వాత.. ఎన్‌ఎంసీ పెట్టిన కండిషన్లపై వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు.
దీంతో ఆయా కాలేజీలు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా మారాయి. ఆయా కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలు చేపట్టకపోవడం, ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడంతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కొరత ఉండడంతో ఎన్‌ఎంసీ అధికారులు తాజాగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు హెచ్చరించినా కాలేజీల్లో సౌకర్యాల కల్పన చేయడం లేదని, వెంటనే దీనికి సమాధానం చెప్పాలని పేర్కొంటూ ఈ నెల 13న ప్రభుత్వానికి, డీఎంఈకి లేఖలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)ను నిశితంగా ప్రశ్నించారు.
సమయం ఇస్తారా?
ఎన్‌ఎంసీ లేఖ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆరోగ్యశాఖ సెక్రటరీ డాక్టర్ మంజుల, డీఎంఈ డాక్టర్ నరసింహం ఆగమేఘాల మీద ఢిల్లీకి పరుగులు తీశారు. బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని ఐదు కాలేజీల్లో ఇప్పటి వరకు చేసిన పనులు, ప్యాకల్టీ నియామకం గురించి వివరించనున్నారు. ఐదు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, లోపాలను సరిదిద్దేందుకు కొంత సమయం కావాలనీ ఎన్‌ఎంసీకి విన్నవించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశంలో ఎన్‌ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సరిదిద్దకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే రెండేళ్ల అడ్మిషన్లు పూర్తి చేశారు. ఇప్పుడు ఐదు మెడికల్ కాలేజీల్లో కలిపి 1,500 మంది ఎంబీబీఎస్ విద్యార్థులున్నారు. ఈ ఏడాది మరో 750 మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరనున్నారు. ఇప్పుడు లోపాలపై ఆగ్రహంతో ఉన్న ఎన్‌ఎంసీ.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు అనుమతి ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హామీ ఇచ్చి తప్పించుకున్నారు!
ఏ ప్రభుత్వం అయినా ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త మెడికల్ కాలేజీల భవనాలు పూర్తి చేసి, ఫ్యాకల్టీని నియమించి, సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆయా కాలేజీలకు అనుమతుల కోసం అభ్యర్థించాలి. కానీ అప్పటి జగన్ ప్రభుత్వం ఫ్యాకల్టీని నియమించకుండా, భవన నిర్మాణాలు కూడా పూర్తి చేయకుండా, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అడ్మిషన్ల ప్రక్రియకు తెరదీసింది. పైగా ఎన్‌ఎంసీ అనేకసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ అనుమతులు తీసుకువచ్చారు. పైగా తాము ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చి మరీ వచ్చారు. ఎన్‌ఎంసీ అనుమతులు ఇచ్చిన తర్వాత కనీసం ఆ కాలేజీల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అప్పటి నిర్లక్ష్యం ఇప్పుడు వైద్య విద్యార్థులకు శాపంగా మారింది.
Updated Date - Jun 18 , 2025 | 04:31 AM