Guntur: గ్రీవెన్స్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
ABN, Publish Date - May 20 , 2025 | 05:11 AM
27 సంవత్సరాలుగా ఆక్రమణదారుల నుంచి తమ స్థలాలను వాపసు పొందేందుకు మహిళలు పోరాడుతున్నారు, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. గుంటూరు కలెక్టరేట్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసి, పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించింది.
27 ఏళ్లుగా తిరుగుతున్నా.. మస్య పరిష్కరించడం లేదని ఆవేదన
ఆక్రమణదారుల నుంచి స్థలాలు ఇప్పించాలని డిమాండ్
ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం
గుంటూరు కలెక్టరేట్‌లో ఘటన.. జీజీహెచ్‌కు తరలింపు
గుంటూరు తూర్పు, మే 19(ఆంధ్రజ్యోతి): ‘ఆక్రమణదారుల చెర నుంచి మా స్థలాలను విడిపించాలంటూ 27 ఏళ్లుగా తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక తిరిగే ఓపిక లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ దోమతోటి బుజ్జి అనే మహిళ గుంటూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం ఆత్మహత్యకు యత్నించారు. పక్కనున్నవారు వారిస్తున్నా.. పట్టించుకోకుండా ఎలుకల మందు తినేయడంతో పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరో బాధితురాలు జొన్నలగడ్డ జ్యోతి వివరాలు తెలిపారు. ‘1998లో వసంతరాయపురం వద్ద రెండో వాటర్ ట్యాంకు నిర్మాణానికి, భూసేకరణ కింద మా స్థలాలను ప్రభుత్వం తీసుకుంది. దీనికి పరిహారంగా పెదపలకలూరు సమీప స్వర్ణాంధ్రనగర్ వద్ద 9 మందికి 60 గజాల చొప్పున 540 గజాలను కేటాయించింది. 373, 376, 377 సర్వే నంబర్లలోని ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు, చదును చేసుకునేందుకు వెళ్లగా.. అక్కడే ఉన్న షేక్ మౌలాలి అనే వ్యక్తి అడ్డుకుని, ‘ఈ స్థలాలతో మీకు సంబంధం లేదు. మళ్లీ ఇక్కడికి వస్తే చంపేస్తా’ అని బెదిరించాడు. దీనిపై ఎమ్మార్వోకు, పోలీసులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మాకు కేటాయించిన స్థలాలను మౌలాలి, అతని కుటుంబ సభ్యులు అమ్మేసుకుంటున్నారు. దీనిపై 27 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఎవరూ న్యాయం చేయలేదు’ అని వాపోయారు. ఇప్పటికయినా న్యాయం జరక్కపోతే తాము కూడా ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పారు.
Updated Date - May 20 , 2025 | 05:11 AM