Rainfall: రాష్ట్రంలోకి నైరుతి
ABN, Publish Date - May 27 , 2025 | 06:11 AM
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనూహ్యంగా 10 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించడంతో రైతులకు మంచి శుభ సంకేతంగా మారింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే మూడు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశముండడంతో పంటల సాగుకు సహకరిస్తాయని అధికారులు తెలిపారు.
సీమలో ప్రవేశం.. కావలి వరకూ విస్తరణ
విశాఖపట్నం, అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 13న అండమాన్‌కు వచ్చిన రుతుపవనాలు 24న కేరళను తాకాయి. అనూహ్యంగా సోమవారమే రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశించాయి. వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా 10 రోజుల ముందే తొలకరి పలకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రుతుపవనాలు సీమలో ఎక్కువ ప్రాంతాలు, దక్షిణ కోస్తాలో కావలి వరకూ విస్తరించాయి. సాధారణంగా జూన్ ఐదో తేదీ నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ ఏడాది అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం నెలకొనడంతో పది రోజుల ముందుగానే వచ్చాయి. గత ఏడాది జూన్ రెండో తేదీన రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో బెంగళూరు, మహారాష్ట్రలో ముంబై వరకూ, తమిళనాడులో మిగిలిన భాగం, తెలంగాణలో కొద్ది ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు రోజుల్లో అరేబియా సముద్రం, కర్ణాటకలో మిగిలిన ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతం, ఈశాన్య భారతంలో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ వరకూ రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మే చివరి వారంలో రోహిణి కార్తె ప్రారంభమై జూన్ తొలివారం వరకూ కొనసాగుతుంది.
ఆ సమయంలో గాడ్పుల ప్రభావం, వర్షాలు లేకపోవడంతో పంటలపై ప్రభావం చూపిన సందర్భాలున్నాయి. రుతుపవనాలు ఆలస్యమైతే మెట్ట పంటల సాగు, వరి నారుమడులు పోసుకోవడంలో జాప్యం, మరోవైపు వడగాడ్పుల తీవ్రత కొనసాగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా మే లో రాష్ట్రంలో రోజు ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తుండడం, చివరి వారం రుతుపవనాలు రావడంతో ఖరీఫ్ పంటలు వేగంగా సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడిందని వాతావరణ నిపుణులు వ్యాఖ్యానించారు.
రానున్న మూడు రోజులూ వర్షాలే!
మధ్య మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో భూ ఉపరితలంపై ఉన్న తీవ్ర అల్పపీడనం సోమవారానికి అల్పపీడనంగా బలహీనపడి మరట్వాడా పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ బంగాళాఖాతంలో ప్రవేశించనుంది. దీని ప్రభావంతో మంగళ లేదా బుధవారం పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది ఒడిశా తీరానికి ఆనుకుని ఉత్తర వాయువ్యంగా తర్వాత ఉత్తరంగా పయనిస్తుందని, ఈ ప్రభావంతో రుతుపవనాలు ఉత్తర కోస్తా, ఒడిశా మీదుగా తూర్పు భారతం వరకూ విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి కొంకణ్, మరట్వాడా, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఎక్కువచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తెలిపింది. కోస్తా తీరం వెంబడి 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
ముందుగానే నైరుతి శుభపరిణామం
ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సీఎం చంద్రబాబు సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘చాలా ఏళ్ల తర్వాత మే నెలలోనే రాష్ట్రానికి నైరుతి పలకరింపు శుభ పరిణామం. రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాలు నిజం కావాలని.. రైతులకు, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. వ్యవసాయాధారిత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే రైతన్న బాగుంటాడు. అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది’అని సీఎం పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 06:11 AM