ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GVMC Park Land: పార్కు స్థలం పాయె

ABN, Publish Date - Jul 04 , 2025 | 03:46 AM

ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు, వారి భూమి విలువ పెరిగేందుకు విశాఖ పట్నంలో ఏకంగా జీవీఎంసీ పార్కు స్థలాన్ని కట్టబెట్టేశారు. ఇందుకు కూటమి నేతలు, అధికారులు సహకరించారు. జీవీఎంసీజోన్‌-2 ఆరో వార్డు పరిధి సర్వే నం.193/1పీలోని 11.36 ఎకరాల్లో వుడా అప్రూవుడ్‌ లే అవుట్‌ వేశారు.

  • విశాఖలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు

  • రోడ్డు కనెక్టివిటీ లేని స్థలాన్ని జీవీఎంసీకి ఇచ్చి పార్కు స్థలం కొట్టేసిన వైనం

  • కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు, వారి భూమి విలువ పెరిగేందుకు విశాఖ పట్నంలో ఏకంగా జీవీఎంసీ పార్కు స్థలాన్ని కట్టబెట్టేశారు. ఇందుకు కూటమి నేతలు, అధికారులు సహకరించారు. జీవీఎంసీజోన్‌-2 ఆరో వార్డు పరిధి సర్వే నం.193/1పీలోని 11.36 ఎకరాల్లో వుడా అప్రూవుడ్‌ లే అవుట్‌ వేశారు. ఓపెన్‌ స్పేస్‌ కింద 1.02 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. లే అవుట్‌లోని అన్ని ప్లాట్లలో ప్రస్తుతం భవన నిర్మాణాలు జరిగిపోయాయి. ఓపెన్‌ స్పేస్‌ కింద కేటాయించిన 1.02 ఎకరాల్లో జీవీఎంసీ బటర్‌ఫ్లై థీమ్‌ పార్కు నిర్మించేందుకు 2021లో రూ.1.92 కోట్లు వెచ్చించింది. పార్కుకు తూర్పువైపున 30 అడుగుల రోడ్డు ఉంది. పార్కుకు వాయవ్య దిశలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన సుమారు 2ఎకరాలు ఉంది. ఆ భూమికి, రోడ్డుకు మధ్యలో పార్కు ఉంది. దీంతో జిరాయితీ భూమికి రోడ్డు సదుపాయం లేక నిరుపయోగంగా ఉండిపోయింది. పార్కు ఈశాన్యం వైపు భాగాన్ని తమకు ఇచ్చేస్తే.. అందుకు ప్రతిగా తమ భూమిలో స్థలం ఇస్తామని యజమానులు ముందుకొచ్చారు. తమ భూమికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడి విలువ పెరుగుతుందని భావించారు. అనుకున్నదే తడవుగా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నేతను ప్రసన్నం చేసుకుని జీవీఎంసీ పార్కు స్థలం బదలాయింపు కోరుతూ ప్రభుత్వానికి పిల్లా లక్ష్మణపాత్రుడు, పోతిన అప్పారావు అనే వ్యక్తుల పేరుతో దరఖాస్తు చేయించారు.

మంత్రి హోదాలో ఉన్న నేత ఒత్తిడి చేయడంతో జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో పెట్టి పార్కు స్థలంలో ఈశాన్యం వైపు ఉన్న 489.39 చదరపు గజాల స్థలాన్ని దరఖాస్తుదారులకు బదలాయించేందుకు, ప్రతిగా వారి భూమిలోని అంతే స్థలాన్ని తీసుకునేందుకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది. దీనిపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. జీవీఎంసీ చేసిన తీర్మానాన్ని, పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తిరస్కరిస్తూ గత సెప్టెంబరులో మెమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్కు స్థలం బదలాయింపు ప్రతిపాదనను తిరస్కరించడంతో దరఖాస్తుదారులు నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ద్వారా మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య అవగాహన కుదరడంతో భూ బదలాయింపు పూర్తిచేయాలంటూ మంత్రిని ఆశ్రయించారు. సదరు మంత్రి పార్కు స్థలం బదలాయింపు చేయాలని సిఫారసు చేశారు. దీంతో మే 13న పార్కు స్థలం బదలాయింపునకు ఆమోదం తెలపడంతో పాటు అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తూ మెమో జారీ చేశారు. ఇదిలావుండగా భూ బదలాయింపునకు జీవీఎంసీకి కౌన్సిల్‌ తీర్మానం తప్పనిసరి. గతంలో కూడా అదే ప్రక్రియను అనుసరించారు. కానీ తాజాగా కౌన్సిల్‌ ఆమోదం లేకుండానే భూ బదలాయింపునకు ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Jul 04 , 2025 | 03:46 AM