Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:00 AM
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు...
వారిలో ముగ్గురు మహిళలు
విశాఖపట్నం, తిరుపతి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు అనకాపల్లిలోని నర్సీపట్నానికి చెందిన వ్యక్తి. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లిలో నివాసం ఉంటున్న బొడ్డేటి నాయుడుబాబు (54), తన భార్య మణికుమారి, ఇతర స్నేహితులతో కలిసి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం మంగళవారం తిరుపతి బయలుదేరి వెళ్లారు. అక్కడ టికెట్ల కోసం క్యూలో జరిగిన తొక్కిసలాటలో నాయుడుబాబు కిందపడి మరణించారు. ఇక...విశాఖలోని కంచరపాలేనికి చెందిన కండిపల్లి శాంతి (35) భవన నిర్మాణ కార్మికురాలు. భర్త వెంకటరావు ఆటో డ్రైవర్. కుమారుడు మహేందర్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఆ ముగ్గురు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. అక్కడ క్యూలో తండ్రీకుమారులు వెనక్కి ఉండగా, ఆమె ముందు వెళ్లారు. ఆ తొక్కిసలాటలో చనిపోయారు. విశాఖ రైల్వే న్యూకాలనీలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సూరిశెట్టి లావణ్య స్వాతి (38) బంధువులతో కలిసి తిరుపతి వెళ్లారు. ఆమె భర్త సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు లాస్య, కీర్తిశ్రీ ఉన్నారు. బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో స్వాతి చనిపోయారు. మద్దిలపాలేనికి చెందిన గుడ్ల రజని భర్త లక్ష్మణరెడ్డి ఆటో డ్రైవర్. కుమారుడు హర్షిత్‌రెడ్డి అమెరికాలో చదువుతున్నాడు. ఏకాదశి టికెట్ల కోసం విశాఖ టీటీడీ కార్యాలయంలో వారు సంప్రదించారు. లభించకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ ఆరో తేదీన తిరుపతి బయలుదేరి వెళ్లారు. తొక్కిసలాటలో చిక్కుకుని రజని మరణించారు.
మృతదేహాల తరలింపులో మంత్రుల చొరవ..
తిరుపతి తొక్కిసలాట ఘటనలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి మంత్రులు ఏర్పాట్లుచేశారు. గురువారం బాధితులను పరామర్శించేందుకు మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ తిరుపతిలోని రుయా ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి మార్చురీ వద్ద మృతుల బంధువులను కలుసుకుని ఓదార్చారు. మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించాలంటూ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో అంత్యక్రియలకు అక్కడి ప్రభుత్వ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కాగా, తొక్కిసలాట అనంతరం రుయాకు తరలించిన వారిలో కొందరు గురువారం డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 8మందిని మెరుగైన చికిత్స కోసం స్విమ్స్‌కు పంపారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న 29 మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈవో శ్యామలరావు, జేఈవో గౌతమి, కమిషనర్ మౌర్య, జేసీ శుభం బన్సల్ బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులను కలిసి ఆరా తీశారు.
Updated Date - Jan 10 , 2025 | 05:02 AM