Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామా.. వైసీపీలో అశాంతి
ABN, Publish Date - Jan 24 , 2025 | 07:52 PM
Vijayasai Reddy: వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మాత్తుగా తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీని వెనుక బలమైన కారణం ఉందా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడి వైఎస్ జగన్ నుంచి సాధారణ స్థాయి కార్యకర్త వరకు అందరిలో అశాంతి నెలకొంది. దీంతో పార్టీలోని పలువురు కీలక నేతలు తమ పదవులకే కాదు.. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి సైతం రాజీనామాలు చేశారు. అయితే శుక్రవారం మాత్రం ఆ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకొంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని ఆయన బల్లగుద్ది చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానంటూ ఆయన వెల్లడించారు.
విజయసాయిరెడ్డి ప్రకటన మరి ముఖ్యంగా వైసీపీ నేతలకు పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు వెన్ను దన్నుగా ఉన్న ఈ విజయసాయిరెడ్డి ఇలా ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా బలమైన కారణాలున్నాయా? అని వారు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
2014 ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయని వారు సోదాహరణగా వివరిస్తున్నారు. ఒకటి రాష్ట్ర విభజన కాగా..మరొకటి ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. అలాగే ఏపీలో మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారని.. ఇదే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మీడియా ఎదుట చెప్పారని వారు గుర్తు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ, బీజేపీకి ఓటర్లు పట్టం కట్టారని.. దీంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారని వారు వివరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ప్రతిపక్ష హోదా దక్కింది. నాటి నుంచి వైసీపీలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు.
ఇంకా చెప్పాలంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకొందంటే.. అదంతా విజయసాయిరెడ్డి చలువేనన్నారు. ఎందుకంటే.. వైసీపీని అధికారంలోకి తీసుకు వచ్చి.. సీఎం పీఠంపై వైఎస్ జగన్‌ను కూర్చోబెట్టడం కోసం విజయసాయిరెడ్డి అన్ని తానై వ్యవహరించారని వారు సోదాహరణగా వివరించారు. వైసీపీతో ప్రశాంత్ కిషోర్ స్నేహం అయితేనేమీ.. వైఎస్ జగన్ పాదయాత్ర చేయడం అయితేనేమీ.. ఇలా ఒకటా రెండా.. పార్టీ ఎన్నికల్లో గెలుపుతోపాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు తెరచాటు మంత్రాంగం నడిపిన ఒకే ఒక్క వ్యక్తి విజయసాయిరెడ్డి అని రాజకీయ విశ్లేషకులు వివరించారు.
కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం విజయసాయిరెడ్డి పాత్ర క్రమక్రమంగా కనుమరుగవుతూ వచ్చిందని గుర్తు చేశారు. ఆయన పాత్రను సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించడంతో.. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జీగా నియమించారని తెలిపారు. ఇక ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ఉత్తరాంధ్ర ఇన్ చార్జీగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయని... అవి కాస్తా.. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వద్దకు చేరడంతో.. ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించారని తెలిపారు.
ఈ బాధ్యతలు నాటి టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కట్టబెట్టారన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డిని కొద్ది రోజుల పాటు దూరం పెట్టారని.. ఆ తర్వాత ప్రాధాన్యత లేని పదవులు కట్టబెట్టారని వివరించారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మాత్రం.. వైసీపీ అధికారంలో ఉండగా విజయసాయిరెడ్డి పాత్ర నానాటికి కనుమరుగవుతూ వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆయనలో అశాంతి రేగిందని చెప్పారు. ఇంతలో ఎన్నికలు రావడం.. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో.. పార్టీలోని పలువురు నేతలు సైతం అశాంతికి గరయ్యారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలా పార్టీ నుంచి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తూ వెళ్లిపోయారని.. వారిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం ఉన్నారని తెలిపారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో వైఎస్ జగన్ రైట్ హాండ్ సైతం విరిగిపోయినట్లేనని తమదైన శైలిలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 24 , 2025 | 08:10 PM