Varra Ravindra Reddy : బాలకృష్ణ, అనిత, మంద కృష్ణపైనే పోస్టులుపెట్టా
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:14 AM
‘సినీనటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబసభ్యులపై మాత్రమే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా. మిగతా వాటి గురించి నాకు తెలియదు’ అని వైసీపీ సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి ...
మిగతా పోస్టులు, ఫోన్ల గురించి తెలియదు
అర కొర సమాధానాలతో సరిపెట్టిన వర్రా
పోస్టులు, కాల్ లిస్ట్ చూపి ప్రశ్నించిన పోలీసులు
ముగిసిన పోలీసు కస్టడీ.. మరోసారి పిలిచే చాన్స్
కడప, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘సినీనటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ, హోంమంత్రి అనిత, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబసభ్యులపై మాత్రమే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టా. మిగతా వాటి గురించి నాకు తెలియదు’ అని వైసీపీ సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ వర్రా రవీంద్రరెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. కడప సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రవీంద్రరెడ్డిని పులివెందుల పోలీసులు రెండ్రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఇన్‌చార్జి ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విచారణ సాగింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. సజ్జల భార్గవరెడ్డి ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి అభయంతోనే పోస్టులు పెట్టానని రెండో రోజు విచారణలోనూ రవీంద్రరెడ్డి చెప్పారు. బూతు కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వెంటనే రవీంద్రరెడ్డి వైసీపీ కీలక నేతలకు ఫోన్లు చేశాడు. ఆ పోస్టులు, కాల్ రికార్డులను చూపి పోలీసులు ప్రశ్నించగా.. ఆ నంబర్లు ఎవరివో.., వాళ్లెవరో తనకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. పోస్టులు పెట్టినందుకు డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించగా.. ‘సజ్జల భార్గవరెడ్డి, రామకృష్ణారెడ్డి సూచనల మేరకే పోస్టులు పెట్టాం.
ఎన్నికల ముందు వైజాగ్, తాడేపల్లిలో జరిగిన సోషల్ మీడియా సమావేశాలకు హాజరయ్యాను. దీనికి సజ్జల కూడా వచ్చారు. ఎన్నికల ముందు టీడీపీ, జనసేనపై పోస్టులు పెట్టాలని చెప్పారు. పోస్టులు పెట్టు.. నీకు పార్టీ అండగా ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నారు. వారి సూచనల మేరకు పోస్టులు పెట్టాను’ అని వర్రా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాగా, మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల, సునీతలపై పోస్టులు పెట్టిన వెంటనే పులివెందుల కీలక నేతలకు వర్రా ఫోన్ చేశాడు. వాటి గురించి పోలీసులు ప్రశ్నించగా.. తెలియదని సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాక ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి, ఎంపీ గత పీఏలు లోకేశ్, రమణారెడ్డిలతో వర్రా మాట్లాడాడు. దీనిపై ప్రశ్నించగా గుర్తులేదని చెప్పాడు. వర్రా రవీంద్రరెడ్డి విచారణకు పూర్తిగా సహకరించకపోవడంతో మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ వేయనున్నారని తెలిసింది.
Updated Date - Jan 10 , 2025 | 04:14 AM