TTD Inspection Officer: టీటీడీకి చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్
ABN, Publish Date - Jun 06 , 2025 | 03:58 AM
తిరుమల-తిరుపతి దేవస్థానాలకు చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ ఆయనను సంబంధిత పోస్టుకు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీనియర్ ఐఏఎస్ సాయిప్రసాద్‌ను నామినేట్ చేసిన ప్రభుత్వం
విధులు, బాధ్యతలపై ఉత్తర్వుల్లో అస్పష్టత
ఈ నియామకంపై టీటీడీ వర్గాల్లో అయోమయం
తిరుపతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): తిరుమల-తిరుపతి దేవస్థానాలకు చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ ఆయనను సంబంధిత పోస్టుకు నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీ చరిత్రలో ఈ తరహా అధికారిని నియమించడం ఇది రెండవ సారి. 2010లో ఐఏఎస్ అధికారి జి.సుధీర్‌ని అప్పటి ప్రభుత్వం ఇదే పోస్టుకు నామినేట్ చేసింది. అప్పుడు కూడా అధికారాలు, విధులు, బాధ్యతలు వంటివేవీ నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించలేదు. తాజా ఉత్తర్వుల్లోనూ అదే విధమైన అస్పష్టత నెలకొంది. గతంలో చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా వ్యవహరించిన సుధీర్ ఆ ఏడాదిలో రెండుసార్లు పర్యటించారని తెలిసింది. ఆ రెండు సందర్భాలలో టీటీడీకి చెందిన అన్ని విభాగాల అధికారులతో సమావేశమై టీటీడీలో పాలన ఎలా జరుగుతోంది? కొత్త కార్యక్రమాలను ఎలా అమలు చేస్తున్నారు? అన్న అంశాలపై సమీక్షించి వెళ్లినట్టు సమాచారం. ఆ తర్వాత మళ్లీ అలాంటి అధికారిని నియమించడం ఇప్పుడే. ఈ నియామకంపై టీటీడీ వర్గాల్లో అయోమయం నెలకొంది. ప్రస్తుత టీటీడీ ఈవో, అదనపు ఈవోలకు... సీఎం చంద్రబాబుకు విశ్వాసపాత్రులైన అధికారులుగా పేరుంది. వారిద్దరినీ సీఎం ఏరికోరి టీటీడీలో నియమించారు. అలాంటప్పుడు మళ్లీ చీఫ్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ నియామకం ఎందుకు అవసరమైందన్న ప్రశ్న టీటీడీ వర్గాలను వేధిస్తోంది. ఇటీవలి కాలంలో టీటీడీ ఉన్నత స్థాయి అధికార, అనధికారులు సీఎం చంద్రబాబుకు అక్కడి వ్యవహారాలపై వేర్వేరుగా నివేదికలు ఇస్తున్నట్టు దేవస్థానం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ నివేదికల్లోని కొన్ని అంశాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నందున సీఎం నిష్పాక్షిక సమాచారం, ఫీడ్ బ్యాక్ కోసం ఈ తరహా నియామకం చేపట్టి వుంటారన్న ప్రచారం జరుగుతోంది. సాయిప్రసాద్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అయినప్పటికీ ఆయన సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగివుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Updated Date - Jun 06 , 2025 | 04:00 AM