Trans Woman: వివాహితైన ట్రాన్స్‌ఉమెన్‌కూ 498(ఏ) రక్షణ
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:35 AM
వివాహం చేసుకున్న ట్రాన్స్‌ఉమెన్(పురుషుడి నుంచి మహిళగా మారిన వ్యక్తి)కు ఐపీసీ సెక్షన్ 498 (ఏ) కింద రక్షణ ఉంటుందని ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తే ఆ సెక్షన్ కింద ఫిర్యాదు చేయవచ్చు
స్త్రీగా పరిగణించలేమన్న వాదనను చట్టం అనుమతించదు: హైకోర్టు
ప్రస్తుత కేసులో వేధింపులకు ఆధారాలు లేవన్న న్యాయమూర్తి
భర్త, అత్తమామలపై ట్రాన్స్‌ఉమెన్ పెట్టిన కేసు కొట్టివేత
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): వివాహం చేసుకున్న ట్రాన్స్‌ఉమెన్(పురుషుడి నుంచి మహిళగా మారిన వ్యక్తి)కు ఐపీసీ సెక్షన్ 498 (ఏ) కింద రక్షణ ఉంటుందని ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హింస, వేధింపులకు పాల్పడినప్పుడు భర్త, అతని కుటుంబ సభ్యులపై ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. సంతానోత్పత్తి సామర్ధ్యం లేనందున ట్రాన్స్‌ఉమెన్‌ను స్త్రీగా పరిగణించడానికి వీల్లేదన్న వాదనను చట్టం అనుమతించదని, రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ట్రాన్స్‌ఉమెన్‌ను స్త్రీగా పరిగణించి 498(ఏ) కింద రక్షణ కల్పించకపోవడం రాజ్యాంగంలోని 14, 15, 21 అధికరణల ప్రకారం వివక్ష కిందికే వస్తుందని పేర్కొంది. ‘‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లకు హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే వారి లింగ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. ట్రాన్స్‌ఉమెన్ అనే కారణంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదుచేసే హక్కు ఆమె కోల్పోదు’’ అని కోర్టు తెలిపింది. అయితే ప్రస్తుత కేసులో భర్త, అత్తమామలు కట్నం కోసం ట్రాన్స్‌ఉమెన్‌ను వేధించినట్లు, ఆమెపై హింసకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు 498 (ఏ) వర్తింపచేయలేమంది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఇటీవల తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ట్రాన్స్‌ఉమెన్ షబానా, చెన్నైకి చెందిన విశ్వనాథన్ కృష్ణమూర్తి ప్రేమించుకుని 2019లో వివాహం చేసుకున్నారు. షబానా భర్తతో కలిసి ఒంగోలులోని తన తల్లిదండ్రుల వద్ద ఉండేది. కొంతకాలం తరువాత విశ్వనాథన్ చెన్నై వెళ్లి తిరిగి రాలేదు. చెన్నైలోని అత్తమామల ఇంటికి వెళ్లగా చంపేస్తానని భర్త బెదిరించాడని, కట్నం కోసం వేధించారని షబానా ఒంగోలులోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ భర్త, కుటుంబసభ్యులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. ట్రాన్స్‌ఉమెన్‌కు సంతానోత్పత్తి సామర్థ్యం లేనందున స్త్రీ నిర్వచనం పరిధిలోకి రాదని, 498(ఏ) కింద కేసు నమోదు చెల్లుబాటు కాదన్నారు. షబానా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రియాంక లక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ఆరోపణల్లో వాస్తవం ఉందా?లేదా అనేది ట్రయల్ కోర్టు తేలుస్తుందన్నారు. కేసును కొట్టివేయవద్దని కోరారు.
Updated Date - Jun 22 , 2025 | 04:35 AM