Fire Department: పరిశ్రమల్లో భద్రతపై థర్డ్‌పార్టీ ఆడిట్
ABN, Publish Date - Jul 05 , 2025 | 05:13 AM
పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా పరీక్షలు చేయించుకోవాలని అగ్నిమాపక శాఖ యాజమాన్యాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ శుక్రవారం వెల్లడించారు...
అగ్నిమాపక శాఖ ఆదేశం
విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా పరీక్షలు చేయించుకోవాలని అగ్నిమాపక శాఖ యాజమాన్యాలను ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణలోని పాశమైలారంలో సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చామన్నారు. అగ్నిమాపక శాఖ వద్ద తగిన నిపుణులు లేకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాలు థర్డ్ పార్టీలను నియమించుకుని భద్రతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అగ్నిమాపక శాఖకు సెల్ఫ్ అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి పరిశ్రమలోనూ డస్ట్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, ప్రతి విభాగంలో సేఫ్టీ ఆడిట్ క్షుణ్ణంగా చేయాలని స్పష్టంచేశారు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యంతోపాటు సేఫ్టీ ఆడిట్ చేసిన థర్డ్ పార్టీని కూడా ప్రాసిక్యూషన్ చేస్తామని తెలిపారు.
Updated Date - Jul 05 , 2025 | 05:15 AM