AP Govt: 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:16 AM
కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం అమలుకు పరిపాలనా అనుమతులు, మార్గదర్శకాలపై గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
తొలివిడతలో 54,94,703 మందికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
మలివిడతలో జూలై 5న పంపిణీ
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం అమలుకు పరిపాలనా అనుమతులు, మార్గదర్శకాలపై గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో 67,27,164 మంది విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొంది. ఆ విద్యార్థుల తల్లులు సుమారు 42,69,459 మంది ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలిపింది. తొలివిడతలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మందికి పైగా లబ్ధిదారుల నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ప్రభుత్వం ఇస్తోందని, అయితే అందులో రూ.2 వేలు పాఠశాలలు, జూనియర్ కాలేజీల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ పనుల కోసం కలెక్టర్ల ఖాతాలో జమ చేయనున్నట్లు వివరించింది. దీంతో ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. లబ్ధిదారులను సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా గుర్తించింది. విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇచ్చే నగదులో పాఠశాలలకు చెల్లించాల్సిన ఫీజులు మినహాయించుకుని మిగిలింది తల్లుల ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఉపకార వేతనాలు పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉపకారవేతనాల నగదు పోగా మిగిలింది తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని వివరించింది. గతంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు అమ్మఒడి వర్తించేది కాదు. ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినవారికి, జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో చేరినవారికి కూడా పథకం వర్తింపజేస్తున్నారు. మొత్తం 11,19,750 మంది లబ్ధిదారులు ఉన్నట్టు అంచనా. ఇక ఇంటింటి సర్వేలో కనిపించని 1,12,711 మందికి మరోసారి పరిశీలన అనంతరం పథకం అమలు చేస్తారు.
నగదు చెల్లింపు విధానం
ప్రతి తల్లి లేదా గార్డియన్ ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలి. ఆధార్ సీడ్ అయిన బ్యాంకు ఖాతాలకే నగదు జమ అవుతుంది. సింగిల్ పేరెంట్ ఉంటే తండ్రి ఖాతాకు నగదు వెళ్తుంది. అనాథ పిల్లల నగదును జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసి, ఆతర్వాత పరిశీలన అనంతరం పంపిణీ చేస్తారు.
నగదు జమ ప్రారంభం
తల్లికి వందనం నగదు జమ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారమే 54 లక్షల మందికి పైగా లబ్ధిదారుల నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా... రాత్రికి అక్కడక్కడా కొందరికి నగదు జమైంది. శుక్రవారం సాయంత్రానికి ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం పథకం నిధులను బ్యాంకులకు పంపింది. అర్హులు, అనర్హుల జాబితాలను గురువారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది.
పథకానికి అర్హతలు
కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు దాటకూడదు.
కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా రైస్ కార్డు కలిగి ఉండాలి.
3 ఎకరాలకు మించి మాగాణి, 10 ఎకరాలకు మించి మెట్ట సాగు భూమి ఉండకూడదు. రెండూ కలిపినా పది ఎకరాలు దాటకూడదు.
నాలుగు చక్రాల సొంత వాహనం ఉండకూడదు (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు).
విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటకూడదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అనర్హులు.
ఆదాయపన్ను చెల్లించేవారు అనర్హులు.
రాష్ట్ర హౌస్‌హోల్డ్ డేటాబే్‌సలో నమోదై ఉండాలి. విద్యార్థి నమోదై, తల్లి నమోదు కాకపోతే పరిశీలన చేసి ఎంపిక చేస్తారు.
ఐటీఐ, పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీల్లో చదివే విద్యార్థులకు పథకం వర్తించదు.
విద్యార్థికి కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాలి. ఈ ఏడాది 75 శాతం ఉంటేనే వచ్చే ఏడాది పథకం వర్తిస్తుంది.
పథకం షెడ్యూలు
54,94,703 మంది విద్యార్థుల నగదు జమ -జూన్ 12
అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శన - జూన్ 12
సచివాలయాల ద్వారా అభ్యంతరాలు, వినతుల స్వీకరణ - జూన్ 12-20
సప్లిమెంటరీ అర్హుల జాబితా రూపకల్పన - జూన్ 21-28
ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల జాబితాల ప్రదర్శన - జూన్ 30
మిగిలిన అర్హులకు నగదు పంపిణీ - జూలై 5
Updated Date - Jun 13 , 2025 | 04:18 AM