Custody Case Bail: విచారణకు సహకరించండి
ABN, Publish Date - May 08 , 2025 | 05:31 AM
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నీలం ప్రభావతి విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు చేయవచ్చని కూడా పేర్కొంది
రఘురామ కస్టోడియల్ కేసులో ప్రభావతికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు సహకరించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అనంతరం ప్రభావతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ప్రభావతి తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివన్ వాదనలు వినిపిస్తూ.. నిందితురాలి కుమారుడు మానసిక సమస్యతో బాధ పడుతున్నాడని తెలిపారు. విచారణకు ఆమె సహకరిస్తున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్ర వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం పడే అవకాశముందన్నారు. ఈ వా దనలు విన్న ధర్మాసనం.. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Updated Date - May 08 , 2025 | 05:31 AM