Strict Action: నకిలీ దర్శన టికెట్లతో మోసగిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:20 AM
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను నకిలీ దర్శన టికెట్లతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ శుక్రవారం హెచ్చరించారు..
భక్తులు దళారులను ఆశ్రయించవద్దు: టీటీడీ సీవీఎస్వో
తిరుమల, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను నకిలీ దర్శన టికెట్లతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ శుక్రవారం హెచ్చరించారు. గత మార్చి నెలలో విజయవాడలోని సిదార్థ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థికి శ్రీవారి సుప్రభాత సేవ, ప్రొటోకాల్ దర్శనం, వసతి కల్పిస్తామని మదనదీపు బాబు అలియాస్ సందీప్, పవన్ అనే వ్యక్తులు రూ.2.60 లక్షలు వసూలు చేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు.
కొంతమంది దళారీలు తాము దర్శన టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. దర్శనాల కోసం దళారులను ఆశ్రయించవద్దని భక్తులను కోరారు. దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరినీ టీటీడీ విజిలెన్స్ అధికారులు పరీక్షిస్తారని, ఆ సమయంలో టికెట్లు నకిలీవని తేలితే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసి దర్శనం, వసతి ఇప్పిస్తామని, డబ్బులు పంపాలని ఫోన్లు చేసినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
Updated Date - Jun 21 , 2025 | 03:20 AM