Minister Manohar: 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:44 AM
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25 నుంచి 31 వరకు చేపడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25 నుంచి 31 వరకు చేపడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ స్మార్ట్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా 1,45,97,486 మంది లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నేతృత్వంలో సభలు ఏర్పాటు చేసి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో మాదిరిగా వీటిపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవని, బ్యాంకు డెబిట్ కార్డు (ఏటీఎం)ల తరహాలో ఉండే ఈ కార్డులపై కుటుంబ పెద్ద ఫొటోతోపాటు సభ్యుల పేర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. భద్రత, జవాబుదారీతనం, పారదర్శకతతో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ కీ రిజిస్టరుతో దీన్ని అనుసంధానం చేశామని వివరించారు. ప్రస్తుతమున్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు 16,08,612 దరఖాస్తులు రాగా.. వాటిలో 15,32,758 దరఖాస్తులను పరిష్కరించామని, 4.72 శాతం దరఖాస్తులను మాత్రమే వివిధ కారణాలతో తిరస్కరించామని వెల్లడించారు. కొత్త సభ్యులతో కలిపి రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కు చేరిందన్నారు. గతేడాది నవంబరులో దీపావళి రోజు ప్రారంభించిన దీపం-2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి మనోహర్ చెప్పారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ సొమ్మును ఇక నుంచి ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ జిల్లాల్లో 4,281 మంది లబ్ధిదారులను గుర్తించి, వారి స్మార్ట్ ఫోన్ నుంచే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లింపు జరిగే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు డిజిటల్ వాలెట్ విధానాన్ని అమలు చేసినట్లు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 04:44 AM