Simhachalam: రేపే అప్పన్న చందనోత్సవం
ABN, Publish Date - Apr 29 , 2025 | 05:03 AM
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం రేపు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు
తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం
సింహాచలం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఈనెల 30న భక్తులకు నిజరూపంలో దర్శనం (చందనోత్సవం) ఇవ్వనున్నారు. చందనోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అప్పన్న దర్శనాలను నిలిపివేస్తారు. దీపారాధన, మూర్తి కలశారాధన, రాత్రి ఆరాధనలు జరిపి సుమారు 11 గంటలకు పవళింపు సేవ కావించి కవాట బంధనం చేస్తారు. రాత్రి ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొపుతారు. 1.30 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ఆ తరువాత ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా ఉండే చందనాన్ని తొలగించి, ప్రభాత ఆరాధన చేస్తారు.
తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి 4 గంటల నడుమ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సంప్రదాయ వస్త్ర సమర్పణలు ఉంటాయి. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను దర్శనం కల్పిస్తారు. రాత్రి 9.30 గంటలకు శ్రీవైష్ణవ స్వాములచే సహస్ర ఘటాభిషేకం, విశేష పూజాదులు నిర్వహించి నివేదనలు సమర్పిస్తారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగుల చందనం సమర్పిస్తారు.
Updated Date - Apr 29 , 2025 | 05:03 AM