DGP Harish Kumar Gupta: మహిళల రక్షణ కోసం శక్తి
ABN, Publish Date - Jul 08 , 2025 | 05:22 AM
రాష్ట్రంలో మహిళల భద్రతే లక్ష్యంగా ‘శక్తి’ బృందాలు, పోలీసులు నిరంతరం పనిచేయడంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు.
ఏడాదిలో 257 కేసుల్లో నిందితులకు శిక్షలు
డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా వెల్లడి
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల భద్రతే లక్ష్యంగా ‘శక్తి’ బృందాలు, పోలీసులు నిరంతరం పనిచేయడంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఏడాదిలో మహిళలపై జరిగిన నేరాల్లో 257 కేసుల్లో నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జీవితకాల శిక్షలతో పాటు 20, 25 ఏళ్ల వరకు ఈ శిక్షలు ఉన్నాయన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే తప్పించుకోలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో 900 హాట్‌స్పాట్లు గుర్తించి, 153 శక్తి బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాలను శక్తి టీమ్స్ ఇప్పటి వరకూ 36,659 సార్లు సందర్శించి, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలు, బాలికలకు సైతం అప్రమత్తంగా ఉండేలా 20,928 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నేరాల కట్టడికి కృషి చేసినట్లు డీజీపీ వివరించారు. శక్తి బృందాలకు 1266 ఎస్‌వోఎస్ కాల్స్ అందగా.. అన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించినట్లు చెప్పారు. డ్రోన్ల ద్వారా ఈవ్‌టీజర్లు, లైంగిక నేరస్తులపై నిఘా పెట్టి అసాంఘిక చర్యలు అరికట్టేందుకు పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఏలూరు జిల్లా తంగెళ్లమూడి గ్రామానికి చెందిన ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా.. శక్తి బృందాలు రక్షించాయని, శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పలాస మండలాల్లో తప్పిపోయిన మహిళలను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించామని, పల్నాడు జిల్లా వినుకొండలో బాలుడిని రక్షించినట్లు వెల్లడించారు. భీమవరంలో పోక్సో కేసులో కోర్టు సోమవారం నిందితుడికి జీవితకాల శిక్ష విధించిందని తెలిపారు.
Updated Date - Jul 08 , 2025 | 05:22 AM