CM Chandrababu: చంద్రబాబు పని అయిపోయింది
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:51 AM
సీఎం చంద్రబాబు పని అయిపోయింది. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది’ అని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
మీడియా హైప్‌తోనే బాబు పాలన: సజ్జల
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పని అయిపోయింది. ప్రజా సమస్యలపై ఢిల్లీకి వెళ్లే ఓపిక కూడా లేకుండా పోయింది’ అని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘హిప్నటిస్ట్ తరహాలో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. యోగా డే పేరుతో తండ్రీ, కొడుకు డ్రామా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ విఫలమయ్యాయి. కేవలం మీడియా హైప్‌తోనే పాలన చేస్తున్నారు. యోగా డే కోసం అంత ఖర్చు ఎందుకు? అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రుషికొండ ప్యాలె్‌సను ప్రస్తావించడం ఏమిటి?’ అని సజ్జల అసహనం ప్రదర్శించారు.
అప్పుల పాలనలో రాష్ట్రం
బాబును ఈవెంట్ మేనేజర్‌గా మోదీ వాడుకుంటున్నారు: రామకృష్ణ
దర్శి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతుందని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనవసర విషయాలకు రూ.కోట్లు వృథా చేస్తున్నారని అన్నారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభమైన సీపీఐ జిల్లా మహసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ మెప్పు కోసం సీఎం చంద్రబాబు రూ.కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశమంతా యోగాడే జరుగుతుంటే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్భాటం చేశారని దుయ్యబట్టారు. అధికార యంత్రాంగాన్ని ఆ పనులకే కేటాయించారని మండిపడ్డారు. బాబును ఈవెంట్ మేనేజర్‌గా మోదీ వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ర్టానికి అధిక నిధులు సాధించామని చెబుతున్నప్పటికీ ఆచరణలో కనిపించటం లేదన్నారు. ఈ ఏడాదిలో రాష్ర్టానికి కేంద్రం ఏం సాయం అందించిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడలేకపోతున్నారని, అక్కడ మిట్టల్ కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తాజాగా పోలవరం, బనకచర్లను వివాదం చేస్తున్నారని విమర్శించారు.
Updated Date - Jun 22 , 2025 | 04:51 AM