Rainfall: తగ్గిన వర్షాలు రాష్ట్రంలో లోటు వర్షపాతం
ABN, Publish Date - Jun 20 , 2025 | 06:33 AM
రాష్ట్రంలో గడచిన వారం, పది రోజుల నుంచి వర్షాలు తగ్గాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ తర్వాత మందగించాయి
26 తర్వాత రుతుపవనాల్లో కదలిక.. 27న అల్పపీడనం: నిపుణులు
విశాఖపట్నం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గడచిన వారం, పది రోజుల నుంచి వర్షాలు తగ్గాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ తర్వాత మందగించాయి. నాలుగు రోజుల క్రితం మరోసారి చురుగ్గా మారి తూర్పు భారతం వైపు పయనించినా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. రుతుపవనాల్లో మందగమనం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. గురువారం జంగమహేశ్వరపురంలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఎండ తీవ్రత ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల ఒకటో తేదీ నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 48.7 మి.మీ.కుగాను 34.4 మి.మీ. వర్షపాతం(సాధారణం కంటే 29 శాతం తక్కువ) నమోదైంది.
ప్రస్తుతం జార్ఖండ్ పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం ఒకటి, రెండు రోజుల్లో బలహీనపడుతుందని, ఆ తరువాత ఈనెల 26వ తేదీకల్లా బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 27వ తేదీకల్లా అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. దీంతో రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారే క్రమంలో రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని వివరించారు.
Updated Date - Jun 20 , 2025 | 06:33 AM