Pawan Kalyan: ఇక రేషన్ దుకాణాల్లో సరుకులు
ABN, Publish Date - Jun 01 , 2025 | 03:17 AM
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మళ్లీ ప్రారంభం కానుంది. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభం
పండుగ వాతావరణంలో పంపిణీకి ఏర్పాట్లు
వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే..
పిఠాపురంలో అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ విధానంతో రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఆదివారం (జూన్ 1) నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీని పునఃప్రారంభించనుంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పట్టణం 18వ వార్డులో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 29,796 చౌక ధరల దుకాణాల్లోనూ ఈ కార్యక్రమం అమలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు రేషన్ డీలర్లు తమ దుకాణాలను పూలతో అందంగా అలంకరించారు. తొలిరోజు స్థానిక కూటమి నాయకుల ద్వారా సరుకుల పంపిణీని లాంఛనంగా ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేశారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు.. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ లోడ్ చేయడంతోపాటు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి అవసరమైన బియ్యం, పంచదార నిల్వలను రేషన్ దుకాణాలకు రవాణా చేసింది.
ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, స్టాక్‌ల వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేయించింది. 65 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సరుకులు అందించేలా జాబితాలను సిద్ధం చేసి డీలర్లకు అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15,74,057 మంది వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకు సరుకులు రానున్నాయి. గతంలో మాదిరిగానే పోర్టబులిటీ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నందున కార్డుదారులు తమకు సమీపంలోని ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు పొందవచ్చు. రాష్ట్రంలో రేషన్‌కార్డులు కలిగి ఉన్న కోటి 46 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి మనోహర్ వెల్లడించారు.
ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా..: పవన్
రేషన్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టేందుకే చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతినెలా 15 రోజుల పాటు, రోజుకు రెండు పూటలా సరుకులు పంపిణీ చేయడం వల్ల దుకాణాల వద్ద రద్దీ తగ్గుతుందని, తద్వారా ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలలో ఒకటి, రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనాలు నిలిపి సరుకులు ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 03:18 AM