Liquor Scam: మద్యం లో దొంగాట
ABN, Publish Date - May 31 , 2025 | 04:11 AM
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విచారణలో మడతపెట్టి తన గత వాంగ్మూలాన్ని తిరస్కరించారు. సిట్ అధికారులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేయగా, కీలక నిందితులను కస్టడీలో పెట్టి వందకిపైగా ప్రశ్నలతో విచారిస్తున్నారు.
నాలుక మడతేసిన సూత్రధారి రాజ్ కసిరెడ్డి
అరెస్టు సమయంలో ఒకలా.. ఇప్పుడు మరోలా..
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పకు
మొత్తం డబ్బులు ఇచ్చినట్లు తొలుత వాంగ్మూలం
తాజా విచారణలో తానలా చెప్పలేదని బుకాయింపు
నిందితుడు చాణక్య వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు
నలుగురు నిందితులను ఒకేసారి విచారించిన సిట్
తొలి రోజు 100 ప్రశ్నలు సంధించిన అధికారులు
విజయవాడ, మే 30(ఆంధ్రజ్యోతి): ‘మద్యం ద్వారా వసూలు చేసిన డబ్బును ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఇచ్చా’... సిట్ అధికారులు అరెస్టు చేసినప్పుడు కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెప్పిన మాటలు ఇవి. ‘వారికి డబ్బులిచ్చానని నేనెప్పుడు చెప్పా? నేనలా అనలేదు’... తాజా విచారణలో కసిరెడ్డి బుకాయింపు ఇది. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వీరిని సిట్ కార్యాలయానికి తరలించి వేర్వేరుగా, కలిపి విచారించారు. ముందుగా ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పను విచారించారు. మొత్తం డబ్బులు వారికిచ్చినట్టు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడని, ఆ డబ్బంతా ఎక్కడుందని ప్రశ్నించారు.
దీనికి ఈ ముగ్గురూ ఒకే సమాధానం చెప్పారు. కసిరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని, అతను తమకేమీ ఇవ్వలేదని వివరించారు. డబ్బులు ఇచ్చినట్టుగా రాజ్ చెప్పిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తర్వాత నలుగురినీ కలిపి విచారించారు. వారికి డబ్బులిచ్చినట్టు వాంగ్మూలం ఇవ్వడంపై రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు. అయితే కస్టడీ విచారణలో కసిరెడ్డి నాలుక మడతేశాడు. తాను ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వలేదని బుకాయించడంతో అధికారులు మిగిలిన ముగ్గురినీ ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పనకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాల్లో ఎవరు పాల్గొన్నారు? ఎక్కడ నిర్వహించారన్న దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని అధికారులు చెప్పడంతో నిందితులకు గొంతులో వెలక్కాయపడినట్టయిం ది. ఈ కేసులో మరో నిందితుడు బూనేటి చాణక్య ఇచ్చిన వాంగ్మూలాన్ని ముందుపెట్టి ప్రశ్నలు సంధించడంతో ముగ్గురూ నీళ్లు నమలడం మొదలుపెట్టారు. మొదటిరోజు సిట్ అధికారులు మొత్తం 100 ప్రశ్నల వరకు సంధించినట్టు తెలిసింది. విచారణ అనంతరం వారికి వైద్య పరీక్షలు చేయించి తిరిగి జిల్లా జైలుకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 04:13 AM