Share News

CM Chandrababu: ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ABN , Publish Date - May 30 , 2025 | 01:00 PM

CM Chandrababu: మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామన్నారు.

CM Chandrababu: ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
CM Chandrababu

అమరావతి, మే 30: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారన్నారు. సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు... కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు సీఎం. నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందన్నారు. మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది.


మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నామన్నారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉందని తెలిపారు. ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో... రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించామన్నారు. ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని సూచనలు చేశారు.


తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కారణం కూడా అదే అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తామని... ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.


కోనసీమ జిల్లాలో సీఎం పర్యటన.. ముమ్మర ఏర్పాట్లు

మరోవైపు కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం 12:50 గంటలకు ముమ్మిడివరం మండలం సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగనున్నారు. అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:05 గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యారులో ఉపాధి హామీ పథకంలో పూడికతీత తీసే ఉపాధి కూలీలతో మాటామంతి నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అర్హులకు పింఛన్ పంపిణీ చేయనున్నారు. అదే గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి.


అక్కడే జిల్లాకు సంబంధించి పేదల సేవలో - బంగారు కుటుంబ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సీహెచ్‌ గున్నేపల్లి గ్రామంలో 3:35 గంలకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్నారు. 5:15 గంటలకు గున్నేపల్లి హెలిప్యాడ్ నుంచి తిరిగి ప్రయాణం కానున్నారు. జిల్లాలో సుమారు ఐదు గంటల పాటు సీఎం పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లును జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని వారు కోరారు.


ఇవి కూడా చదవండి

ఇదెక్కడి అభిమానంరా బాబు.. ఏకంగా పాముతోనే థియేటర్లోకి ఎంట్రీ

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 30 , 2025 | 01:33 PM