Quantum Computing: క్వాంటమ్ వచ్చేస్తోంది
ABN, Publish Date - Jun 26 , 2025 | 03:27 AM
సాంకేతిక విప్లవంలో మరో ముందడుగుగా భావించే క్వాంటమ్ కంప్యూటింగ్ వేగం అనూహ్యంగా ఉంటుందని సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న అన్నారు.
నాలుగేళ్లలో విప్లవాత్మకంగా మారుతుంది.. క్వాంటమ్ కంప్యూటింగ్ వేగం అనూహ్యం.. త్వరలోనే మన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది.
జనవరిలో అమరావతిలో వ్యాలీ ప్రారంభం
30న విజయవాడలో జాతీయస్థాయి వర్క్‌షాప్‌సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడి
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): సాంకేతిక విప్లవంలో మరో ముందడుగుగా భావించే క్వాంటమ్ కంప్యూటింగ్ వేగం అనూహ్యంగా ఉంటుందని సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న అన్నారు. 2029 నాటికి ఆ టెక్నాలజీ విప్లవాత్మకంగా మారుతుందని చెప్పారు. వచ్చే జనవరిలో అమరావతి రాజధానిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అన్నారు. వ్యాలీ నిర్మాణ డిజైన్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఈనెల 30న విజయవాడలో క్వాంటమ్ కంప్యూటింగ్ నేషనల్ వర్క్‌షాప్ జరగనున్న నేపథ్యంలో బుధవారం విజయవాడలో అవగాహన, సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రద్యుమ్నతో పాటు ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, టీసీఎస్ సలహాదారు అనిల్ ప్రభాకర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘ్, ఎల్జీఐ మైండ్ ట్రీ లీడ్ విజయరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ‘అతి త్వరలోనే క్వాంటమ్ టెక్నాలజీ ప్రజలందరి జీవితాల్లోకి వచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయి. రక్షణ సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఔషధ సంస్థలు, వ్యవసాయ పరిశోధన, వైద్యం వంటి పలు రంగాల్లోని సంస్థలు విస్తృతంగా వినియోగించడానికి సిద్ధమవుతున్నాయి. దశాబ్దాలు పట్టే సమస్యలకు కూడా గంటల వ్యవధిలోనే పరిష్కార మార్గాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ చెబుతుంది. ఐటీలో రాష్ట్ర యువత నిష్ణాతులైనందున క్వాంటమ్ కంప్యూటింగ్‌ను రాష్ట్రానికి పరిచయం చేయాలని సీఎం భావించారు’ అని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రభుత్వ సేవల వేగాన్ని పెంచవచ్చని భాస్కర్ చెప్పారు.
Updated Date - Jun 26 , 2025 | 03:27 AM