PSR Anjaneyulu Remanded: గ్రూపు-1 కేసులోనూ పీఎస్‌ఆర్‌కు రిమాండ్
ABN, Publish Date - May 09 , 2025 | 05:51 AM
ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ ఆంజనేయులు రిమాండ్. విజయవాడ కోర్టు 22 వరకూ రిమాండ్ విధించింది
22 వరకూ విధిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు
విజయవాడ, మే 8(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనం కేసులోనూ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులకు రిమాండ్ విధించారు. ఈ నెల 22 రిమాండ్ విధిస్తూ గురువారం విజయవాడ ఒకటో ఏజేసీజే కోర్టు న్యాయాధికారి దేవిక ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గ్రూపు-1 డిజిటల్ మూల్యాంకనం కేసులోనూ ప్రధాన నిందితుడు కావడంతో విజయవాడలోని సూర్యరావుపేట పోలీసులు కోర్టులు పీటీ వారెంట్ వేసిన విషయం తెలిసిందే. దీనికి అనుమతి ఇవ్వడంతో జైలు నుంచి పీఎస్‌ఆర్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఏపీపీఎస్సీకి సంబంధించిన ఫుట్‌నోట్స్ ఆయన వద్ద ఉందని, అందులో ఆయన సంతకాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిఖ్ కోర్టుకు తెలిపారు. ఈ ఫుట్‌నోట్స్ పీఎస్‌ఆర్ వద్ద ఉండడం వల్ల దర్యాప్తు అధికారికి లభించలేదని చెప్పారు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల పత్రాలను కమిషన్ గుర్తించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మూల్యాంకనం చేయాలన్నారు. ఇందుకు విరుద్ధంగా కామ్‌సైన్ సంస్థకు మూల్యాంకనం బాధ్యతలు అప్పగించారని, రూ.1.14 కోట్లు చెల్లించారని, పేమెంట్ చెక్‌పై పీఎస్‌ఆర్ సంతకం చేశారని వివరించారు.
పీఎస్‌ఆర్ తరఫున న్యాయవాది విష్ణువర్ధన్ వాదనలు వినించారు. అయితే మొదట కోర్టులో హాజరుపరచినప్పుడు పీఎస్‌ఆర్ సొంతగా వాదనలు వినిపించుకున్నారు. న్యాయాధికారి బెంచ్‌పైకి రికార్డులు వెళ్లాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధిఖ్ వేరే కోర్టులో ఉండడంతో రావడం ఆలస్యమైంది. ఈలోపు పీఎస్‌ఆర్ మాట్లాడడం మొదలుపెట్టారు. పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమమని వాదించారు. తనను కావాలని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని చెప్పారు. ఏమైనా ఉంటే ట్రయల్‌లో చెప్పుకోవాలని న్యాయాధికారి సూచించారు. తర్వాత పీపీ వచ్చేవరకు పోలీసులు ఆయన్ను కక్షిదారుల వెయిటింగ్ హాలులోకి తీసుకెళ్లారు.
దర్యాప్తు అధికారి ఎక్కడున్నాడు?
పీఎస్‌ఆర్ వెయిటింగ్ హాలులో ఉన్నప్పుడు బయట కాపలా ఉన్న పోలీసులను పిలిచి కేసులో దర్యాప్తు అధికారి ఎవరని ప్రశ్నించారు. వారు నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్ పేరు చెప్పారు. ఇక్కడికి కోర్టు వచ్చాడా.. ఎక్కడున్నాడని ఆయన అడిగారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో మాట్లాడుతున్నారని వారు తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి దర్యాప్తు అధికారి తిలక్ బంధువా అని ఎస్కార్ట్ సిబ్బందిని అడిగారు. ఆ విషయం తమకు తెలియదని వారు సమాధానం ఇచ్చారు. సిబ్బంది ఏసీపీ తిలక్‌కు విషయం చెప్పడంతో, ఆయన పీఎస్‌ఆర్ వద్దకు వెళ్లి తానే దర్యాప్తు అధికారినని వివరించారు. తనను కస్టడీకి ఎప్పుడు తీసుకుంటారని పీఎస్‌ఆర్ ప్రశ్నించారు. తాము ఇంకా అంతవరకు వెళ్లలేదని, కేసు దర్యాప్తులో మాత్రమే ఉన్నామని తిలక్ సమాధానం ఇచ్చారు.
Updated Date - May 09 , 2025 | 05:51 AM