Liquor Scam Raids: జగన్ పత్రిక ఎడిటర్ ఇంట్లో పోలీసుల సోదాలు
ABN, Publish Date - May 09 , 2025 | 06:15 AM
మద్యం స్కామ్ కేసులో విచారణలో భాగంగా జగన్ పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి, పీఏ కె.నాగేశ్వర రెడ్డి ఇంట్లలో విజయవాడ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిందితులు అక్కడ ఉండే అవకాశముందని అనుమానంతో సెర్చ్ వారెంట్‌తో వెళ్లినట్టు తెలుస్తోంది
జగన్ పీఏ కేఎన్‌ఆర్ ఇంట్లో కూడా..
విజయవాడ, మే 8(ఆంధ్రజ్యోతి): జగన్ పత్రిక సంపాదకుడు ఆర్.ధనుంజయ రెడ్డి నివాసంలో విజయవాడ పోలీసులు సోదాలు జరిపారు. జగన్ వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వర రెడ్డి (కేఎన్‌ఆర్) ఇంటికీ వెళ్లారు. విజయవాడ వెటర్నరీ కాలనీలో పక్క పక్క వీధుల్లో వీరు నివాసం ఉంటున్నారు. మద్యం స్కామ్‌లో నిందితులైన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉండే అవకాశముందన్న సమాచారంతో గురువారం ఈ సోదాలు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసులు ముందుగా వారికి సెర్చ్ వారెంట్ ఇచ్చారు.
నిందితుల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘‘వీళ్లిద్దరూ తరచూ మీ వద్దకు వస్తారని సమాచారం ఉంది. వీరి సెల్‌ఫోన్లు స్విచ్చాఃఫ్‌లో ఉన్నాయి. ఒకవేళ వారు మళ్లీ మీ వద్దకు వస్తే మాకు తెలియజేయండి’’ అని స్పష్టం చేసి... అక్కడి నుంచి వెళ్లిపోయారు. మద్యం స్కామ్‌లో నిందితుల కోసం ఆరా తీసేందుకు పోలీసులు రాగా... దీనిని జగన్ రోత మీడియా ‘పత్రికా స్వేచ్ఛపై దాడి’గా చిత్రీకరించడం గమనార్హం.
Updated Date - May 09 , 2025 | 06:15 AM