Sai Shreyas Pharma: ఇద్దరి ప్రాణం తీసిన విష వాయువు
ABN, Publish Date - Jun 13 , 2025 | 05:53 AM
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయిశ్రేయాస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్‌లో విష వాయువు పీల్చడంతో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు.
మరొకరి పరిస్థితి విషమం.. ఫార్మాసిటీలోని సాయిశ్రేయాస్ ఫార్మాస్యూటికల్స్‌లో ఘటన
పరవాడ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని సాయిశ్రేయాస్ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్‌లో విష వాయువు పీల్చడంతో ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు కథనం మేరకు.. ఫార్మా కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన పగిరి చంద్రశేఖర్ (32) సేఫ్టీ అసిస్టెంట్ మేనేజర్‌గా, అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్ (25) సేఫ్టీ షిఫ్ట్ ఆఫీసర్‌గా, ఒడిశాకు చెందిన బైడు బన్సాల్ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 1.20 గంటల సమయంలో చంద్రశేఖర్, కుమార్, బన్సాల్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో వ్యర్థ రసాయనాలు ఎంతవరకూ ఉన్నాయో చూసేందుకు వెళ్లి ట్యాంకుపై మూత తీశారు. ఈ క్రమంలో వ్యర్థ రసాయనాలను పీల్చడంతో చంద్రశేఖర్, కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా, బన్సాల్ అస్వస్థతకు గురయ్యాడు. ముగ్గురినీ హుటాహుటిన షీలానగర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చంద్రశేఖర్, కుమార్ మృతి చెందగా బన్సాల్‌కు ఐసీయూలో వైద్యసేవలందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు కంపెనీ యాజమాన్యం రూ.55 లక్షల చొప్పున పరిహారం అందజేసింది.
Updated Date - Jun 13 , 2025 | 05:55 AM