ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఉగాది నుంచి ‘పీ4’!

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:05 AM

పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.

  • పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యంగా కార్యక్రమం

  • అర్హులైన పేదలను గుర్తిస్తున్న ప్రభుత్వం

  • ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలతో సాయం

  • ఎల్లుండి నాటికి 10 జిల్లాల్లో సర్వే పూర్తి

  • 8 నుంచి 18 వరకూ మరో 16 జిల్లాల్లో సర్వే

  • 4 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు

  • పైలట్‌గా 5,869 కుటుంబాలకు లబ్ధి: చంద్రబాబు

  • ఆగస్టుకు 5 లక్షల కుటుంబాలు పథకం పరిధిలోకి

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన పీ4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు అదనంగా ఈ నూతన విధానాన్ని అమలు చేయనుంది. దీనికి సంబంధించి ‘పీ4, కుటుంబ సాధికారత- ప్రయోజనాల నిర్వహణ వ్యవస్థ’పై సీఎం చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో శాఖాపరమైన సమావేశం నిర్వహించారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలు ఆర్థిక చేయూతనివ్వడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు గ్రామాల్లో పీ4 విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, దీనిద్వారా 5,869 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అర్హత కలిగిన కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటా, కుటుంబ సర్వే, గ్రామసభల ద్వారా ధ్రువీకరిస్తామని వివరించారు. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారిని, 4 చక్రాల వాహనాలు ఉన్నవారు, 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నవారు, మున్సిపల్‌ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలను ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. 40లక్షల కుటుంబాలు పీ4 విధానంలో లబ్ధిపొందేందుకు అర్హులని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది.


కొనసాగుతున్న కుటుంబ సర్వే

కుటుంబ సర్వే మొదటి దశ కింద 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి చేపట్టిన సర్వే మార్చి 2 నాటికి పూర్తవుతుంది. 52 లక్షల కుటుంబాలకుగాను 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండోదశ లో మిగిలిన 16జిల్లాల్లో మార్చి 8నుంచి ప్రారంభించి 18నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఈ పీ4 విధానం అమల్లోకి వచ్చినా ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవు. లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తయ్యాక సమృద్ధి బంధనమ్‌ ప్లాట్‌ఫాంలో ఆ కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. ఈ కుటుంబాల మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల్లో ఎక్కడా ప్రభుత్వ జోక్యం ఉండదు. కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.

దాతలను ఎలా గుర్తిస్తారు?

పీ4 పరిధిలోకి వచ్చే పేదల కుటుంబాలను గుర్తిస్తున్న ప్రభుత్వం... దాతలను ఎప్పుడు, ఎలా గుర్తిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తేవాలని లక్ష్యం కూడా పెట్టుకున్నారు. కానీ, మొత్తం సమీక్షలో దాతల గురించి చర్చకు రాలేదని సమాచారం.

’సమృద్ధి బంధనమ్‌’... ఇదేం భాష?

రాష్ట్ర ప్రభుత్వంలో సమాంతర వ్యవస్థను నడిపిస్తున్న ఉత్తరాది కన్సల్టెంట్ల భాష ఓ పట్టాన అర్థం కావడం లేదు. పీ4 విధానంలో లబ్ధిదారులను, దాతల కుటుంబాలను ఒక్కచోట కలిపేందుకు ఐటీ శాఖ రూపొందించిన వేదికకు సమృద్ధి బంధనమ్‌ అనే పేరు పెట్టారు. తెలుగు ప్రజల కోసం రూపొందించిన పీ4 పథకంతో పాటు వేదిక పేరు కూడా జనాల్లోకి మాత్రం ఆశించినంతగా వెళ్లడం లేదని చెబుతున్నారు.

Updated Date - Feb 28 , 2025 | 03:05 AM