Operation CAGAR: అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ కగార్
ABN, Publish Date - Jun 23 , 2025 | 03:56 AM
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కోసం దేశ ప్రజల మీదే యుద్ధాన్ని ప్రకటించి కొనసాగిస్తున్నది.
50 ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సులో వక్తలు
గుంటూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కోసం దేశ ప్రజల మీదే యుద్ధాన్ని ప్రకటించి కొనసాగిస్తున్నది. వచ్చే ఏడాది మార్చి ఆఖరు కల్లా చివరి మావోయిస్టుని మట్టుబెడతామని కేంద్ర హోం మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కార్పొరేట్లకు ఇచ్చిన మాట కోసమేనని అర్థమౌతోంది. అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, కార్పొరేట్లకు కట్టబెట్టడం ఈ ఆపరేషన్‌లో భాగమే’ అని పలువురు వక్తలు ఆరోపించారు. ‘50 ఏళ్ల (1974-2024) వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థానం’ రాష్ట్ర సదస్సు ఆదివారం గుంటూరు నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట ఉన్న ఎన్‌జీవో అసోసియేషన్ హాల్‌లోని చాగంటి భాస్కరరావు సమావేశ మందిరంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వామపక్ష విద్యార్థి, విప్లవ ఉద్యమాల్లో పాల్గొన్న పలువురు నేతలు హాజరయ్యారు. అమరుల స్థూపావిష్కరణ చేశారు. ఇటీవలే అమరులైన ‘నంబాళ్ల కేశవరావు, మైలారపు ఆడెళ్లు, సజ్జా నాగేశ్వరరావు, తెంటు లక్ష్మీవెంకట నరసింహాచలం జ్ఞాపకాలు’, ‘ఆంధ్రప్రదేశ్ విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్ర’, ‘ఆపరేషన్ కగార్ - భారత దేశంలో అంతర్యుద్ధం’, ‘సాయుధ పోరాట సంస్థలు - శాంతిచర్చలు - అనుభవాలు’ తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. సదస్సుకు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గుంటూరు ఎస్పీతో చర్చించగా అనుమతి ఇచ్చారు.
Updated Date - Jun 23 , 2025 | 03:56 AM