AP Govt Incentives: ఆయిల్‌పామ్‌కు మంచి రోజులు
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:01 AM
ప్రభుత్వ ప్రోత్సాహం... ఆశాజనకంగా ఉన్న ధరతో ఆయిల్‌పామ్ సాగుకు మంచి రోజులు వచ్చాయి. దేశంలో ఆయిల్‌పామ్ విస్తీర్ణంలో 50ు రాష్ట్రంలోనే సాగవుతోంది. ఆయిల్‌పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉద్పాదకతలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది.
సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం.. టన్నుకు రూ.20 వేల సగటు ధర
కొత్త ప్రాంతాల్లో సాగు విస్తరణకు ప్రణాళికలు
మొక్కల కొరత తీర్చేందుకు తూర్పుగోదావరిలో ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రోత్సాహం... ఆశాజనకంగా ఉన్న ధరతో ఆయిల్‌పామ్ సాగుకు మంచి రోజులు వచ్చాయి. దేశంలో ఆయిల్‌పామ్ విస్తీర్ణంలో 50ు రాష్ట్రంలోనే సాగవుతోంది. ఆయిల్‌పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉద్పాదకతలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2.49లక్షల హెక్టార్లలో తోటలు ఉన్నాయి. 24 జిల్లాల్లో 373 మండలాల్లో 1.97లక్షల మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి ఆయిల్‌పామ్‌లో 85-90శాతం మన రాష్ట్రం నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో సాగును మరింత ప్రోత్సహించేందుకు, కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రైతుల డిమాండ్‌ను తీర్చడానికి ఆయిల్‌పామ్ విత్తన మొలకల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి, మొక్కల దిగుమతిని తగ్గించడానికి రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్‌లను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మోరంపూడిలోని ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్‌లో గతేడాది నుంచి విత్తనోత్పత్తిని ప్రారంభించింది. రైతులకు మొక్కలు సరఫరా చేయడానికి లక్ష ఆయిల్‌పామ్ సీడ్ మొక్కలను ఉత్పత్తి చేసి, ఆయిల్‌పామ్ కంపెనీలకు సరఫరా చేస్తోంది. ఈవిధంగా ఆయిల్‌పామ్ సాగుకు రైతులను ప్రభుత్వం ప్రోత్సాహిస్తోంది. గతేడాది నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ కింద 4 జిల్లాల్లో 19 మండలాలను వివిధ కంపెనీలకు కేటాయించింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టడానికి అధ్యయనం చేపట్టాలని (ఐఐఓపీఆర్)ను ప్రభుత్వం కోరింది.
ఆయిల్‌పామ్ ప్లాంట్ మెటీరియల్, నిర్వహణ, అంతరపంటలు, యంత్ర పరికరాల కోసం 1.20లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.167.83కోట్లు విడుదల చేసింది. ఆయిల్‌పామ్ రంగాన్ని కీలకమైన పనితీరు సూచీల్లో ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఆయిల్‌పామ్ తోటల పురోగతిని మంత్రి అచ్చెన్నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఫలితంగా 2024-25లో 22,258హెక్టార్ల సాగు లక్ష్యాన్ని సాధించినట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గత దశాబ్దంలోనే ఈ పెరుగుదల అత్యధికం. గత ఐదేళ్లలో ఆయిల్‌పామ్ తాజా పండ్ల గెలలకు సగటు ధర టన్నుకు రూ.13,132 నుంచి రూ.14వేల దాకా ఉండగా, గత 8నెలల సగటు ధర రూ.20,300 నమోదైంది.
Updated Date - Jun 07 , 2025 | 03:03 AM