ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NTR Medical Services: ఎక్కడి క్లెయిమ్‌లు అక్కడే

ABN, Publish Date - Jun 30 , 2025 | 02:57 AM

ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌లో పాలన పూర్తిగా స్తంభించింది. ఎంప్యానెల్‌మెంట్లు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీల ఊసే లేదు. జరిమానాలు అసలే లేవు. లక్షలాది క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రస్ట్‌ ఉన్నతాధికారి తాను పని చేయరు...

  • వైద్యసేవ ట్రస్ట్‌లో 2.60 లక్షలు పెండింగ్‌

  • 2 నెలలుగా ప్రాసెస్‌ చేయని అధికారులు

  • వీటి విలువ దాదాపు రూ.600 కోట్లు

  • బిల్లులు రాక ఆస్పత్రులు విలవిల

  • ఆకస్మిక తనిఖీల్లేవు.. జరిమానాలు లేవు

  • ట్రస్ట్‌ ఉన్నతాధికారి నిర్వాకంతో అస్తవ్యస్తం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌లో పాలన పూర్తిగా స్తంభించింది. ఎంప్యానెల్‌మెంట్లు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీల ఊసే లేదు. జరిమానాలు అసలే లేవు. లక్షలాది క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రస్ట్‌ ఉన్నతాధికారి తాను పని చేయరు... కిందస్థాయి అధికారులను పని చేయనివ్వరని ఆరోపణలొస్తున్నాయి. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితేఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యసేవ ట్రస్ట్‌ ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స పొందిన రోగులకు సంబంధించిన బిల్లులు క్లెయిమ్‌ల రూపంలో వస్తాయి. వీటిని వెంటనే ప్రాసెస్‌ చేసి సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపించడమే ట్రస్ట్‌ ప్రధాన విధి. ప్రస్తుతం ట్రస్ట్‌ అధికారులు ఈ పని కూడా చేయడం లేదు. గత రెండు నెలలుగా ట్రస్ట్‌ నుంచి ఒక్క క్లెయిమ్‌ కూడా సీఎ్‌ఫఎంఎ్‌సకు వెళ్లలేదు. ప్రస్తుతం ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో దాదాపు 2.60 లక్షల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో క్లెయిమ్‌లు పెండింగ్‌ పెట్టిన సందర్భాలు ట్రస్ట్‌ చరిత్రలో లేవు. ట్రస్ట్‌కు ప్రతిరోజూ దాదాపు 5వేల నుంచి 6వేల వరకూ ప్రీఆథరైజేషన్ల (శస్త్రచికిత్సకు అనుమతి కోసం వచ్చే వినతులు)తో పాటు సుమారు 5వేల క్లెయిమ్‌లు వస్తాయి. ఆస్పత్రుల నుంచి క్లెయిమ్‌ను అప్‌లోడ్‌ చేయగానే ట్రస్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వద్దకు వస్తాయి. అక్కడినుంచి ప్యానల్‌ డాక్టర్‌కు, ఆపరేషన్స్‌ ఈవోకు ఆ తర్వాత సీఈవోకి వెళ్తాయి. సీఈవో లాగిన్‌ నుంచి సీఎ్‌ఫఎంఎ్‌సకు అప్‌లోడ్‌ అవుతాయి.

ప్రభుత్వం బిల్లులు చెల్లించే సమయంలో క్లెయిమ్స్‌కు సంబంధించిన నిధులు ఆస్పత్రుల ఖాతాల్లోకి వెళ్తాయి. గత రెండు నెలల నుంచి 2.60 లక్షల క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేయకపోవడంతో ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే రూ.కోట్ల బిల్లులు ఆస్పత్రులకు చెల్లించాల్సి ఉంది. క్లెయిమ్‌లు ప్రాసెస్‌ చేయకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లాల్సిన బిల్లులు ట్రస్ట్‌లోనే నిలిపోతున్నాయి. ట్రస్ట్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఇస్తున్న కాస్త బిల్లులు కూడా ఆస్పత్రులకు చేరడం లేదు.

కలెక్టర్లు చూసుకుంటారులే...

ప్రస్తుతం ట్రస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ మొత్తం నేషనల్‌ హెల్త్‌ ఆథారిటీ (ఎన్‌హెచ్‌ఏ)లోకి మారుతోంది. ఈ బాధ్యతలు ట్రస్ట్‌ సిబ్బందికి అప్పగించడంతో క్లెయిమ్‌లు పెండింగ్‌లో పడ్డాయి. దీనికితోడు ట్రస్ట్‌ ఉన్నతాధికారి తీవ్ర నిర్లక్ష్యం కూడా పెండింగ్‌కు కారణంగా మారింది. ట్రస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ఎన్‌హెచ్‌ఏ పరిధిలోకి వెళ్తే క్లెయిమ్‌లు జిల్లా కలెక్టర్ల లాగిన్‌కు వెళ్తాయి. ఏదైనా సమస్య వచ్చినా కలెక్టర్లు చూసుకుంటారన్న ఆలోచనలో ఉన్నారు. అప్పుడు తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తయ్యే వరకూ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను నిలిపివేయాలని ఉన్నతాధికారి నిర్ణయించారు.

సంతకం అంటే భయం..

ట్రస్ట్‌ ఉన్నతాధికారికి సంతకం అంటే చాలా భయం. ఏ ఫైల్‌పైనా ఆయన సంతకాలు చేయరు. చివరికి ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ఫైల్‌పై సంతకం పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కిందస్థాయి అధికారులు ఏదైనా ఫైల్‌ పెట్టినా దానిని రిజెక్ట్‌ చేయడమో లేదా తర్వాత చర్చిద్దామని పక్కన పెట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. ట్రస్ట్‌కు ప్యానల్‌ డాక్టర్లు చాలా ముఖ్యం. వారు సక్రమంగా విధులు నిర్వహిస్తేనే ట్రస్ట్‌ ద్వారా రోగులకు వైద్య సేవలు అందుతాయి. అలాంటి కీలకమైన ప్యానల్‌ డాక్టర్లకు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పెండింగ్‌ పెట్టారు. జీతాలకు సంబంధించిన ఫైల్‌ ఉన్నతాధికారి వద్దకు ఎన్నిసార్లు తీసుకువెళ్లినా దానిని పక్కన పెట్టాలని ఆదేశిస్తున్నారు. సంతకాల భయంతో సదరు ఉన్నతాధికారి ట్రస్ట్‌ను భ్రష్ఠు పట్టించారు. ఆ భయంతోనే లక్షల్లో క్లెయిమ్‌లు పెండింగ్‌ పెట్టారు. ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం ట్రస్ట్‌కు వెళ్లి సమీక్ష నిర్వహించారు. అక్కడ ఏ పని జరగడం లేదని తెలుసుకున్న ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. లక్షల్లో క్లెయిమ్‌లు పెండింగ్‌ పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మాత్రం మార్పు రాలేదు.

జీరో పెనాల్టీలు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లో వివిధ ఆస్పత్రులకు రూ.13కోట్ల పెనాల్టీలు విధించారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి కూడా చాలా సమావేశాల్లో గర్వంగా చెప్పుకున్నారు. కానీ గత మూడు నెలల నుంచి ట్రస్ట్‌ అధికారులు పెనాల్టీల ఊసే ఎత్తడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌కు 3నెలల నుంచి తాళం వేసేశారు. ఆరోగ్యశాఖలో అత్యంత కీలక విభాగమైన ఎన్టీఆర్‌ వైద్య సేవలో యాక్టివ్‌గా ఉండే అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 03:00 AM